
ఆడికృత్తిక వేడుకల ఏర్పాట్ల పరిశీలన
తిరుత్తణి: ఆడికృత్తిక వేడుకల ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం తనిఖీ చేశారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆగస్టు 16న ఆడికృత్తిక వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకల్లో తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల నుంచి మూడు లక్షలకు పైబడిన భక్తులు కావళ్లతో పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లకు సంబందించి జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో కొండ ఆలయం నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణంలోని పలు ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేసారు. ముందుగా కొండ ఆలయంలో ని సీసీ కెమెరాలు, కావడి మండపంలో భక్తులకు సదుపాయాలు, కారు పార్కింగ్ వద్ద సదుపాయాలు, తలనీలాలు సంప్రదించే కేంద్రంలో తనిఖీ చేశారు. అనంతరం కొత్త బస్టాండు, శరవణ పుష్కరిణి, నల్లాన్ పుష్కరిణి, తాత్కాలిక బస్టాండు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలతో పాటూ భక్తులకు తాగునీరు. తాత్కాలిక స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఏర్పాటుకు సంబంధించి పరిశుభ్రత, వైద్య శిబిరాలు, విద్యుత్ సేవలు, సీసీటీవీ కెమెరాల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. జాయింట్ కమిషనర్ రమణి, ఆర్డీఓ కణిమొళి, ఆలయ ట్రస్టీలు సురేష్‌బాబు, ఉష సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.