
వైభవంగా గోదై నాచియార్ వైభవ పూజ
కొరుక్కుపేట: చైన్నెకు చెందినవాసవీ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో గోదైనాచియార్ (గోదాదేవి) వైభవ పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. వివరాలు.. గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఆడిపూరం సందర్భంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలను వాసవీ మహిళా విభాగ్ అధ్యక్షురాలు టి. లావణ్య అధ్యక్షతన నిర్వహించారు. చైన్నె జార్జిటౌన్ ప్రాంతంలోని ఆదియప్పనాయకన్ వీధిలో వెలసియున్న శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో చేపట్టిన ఈ ఆండాల్ పూజలో వివిధ రకాల పుష్పాలు, తులసీ దళాలు, వజ్రాభరణాలు, పట్టువస్త్రాలతో గోదాదేవిని విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు దిలీప్ కుమార్ పంతులు ఆండాల్ పూజను చేయించారు. మహిళలు దాదాపు 200మందికిపైగా మహిళలు పాల్గొని సామూహికంగాగోదాదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. గోదాదేవి విష్ణుమూర్తిని స్తుతిస్తూ 30 పాసురాళ్లను వాసవీ మహిళా విభాగ్ సభ్యులు పారాయణంచేసి ఆథ్యాత్మిక శోభను తెచ్చారు. కార్య క్రమంలో విభాగ్ అధ్యక్షురాలు టి.లావణ్య, కార్యదర్శి జి. సరళ, ట్రెజరర్ బి.సరళ, వైస్ ప్రెసిడెంట్ పి.కల్పన భక్తులందరికి పసుపు కుంకుమ, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.