
వివాహిత ఆత్మాహుతికి యత్నం
● అడ్డుకున్న పోలీసులు
తిరువళ్లూరు: భర్తపై ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మాహుతికి యత్నించిన సంఘటన పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ పట్టరై గ్రామానికి చెందిన జయంతి(45). ఈమె భర్త ఉలగనాథన్. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. పెద్ద కుమార్తె భారతికి వివాహమైంది. ఈ క్రమంలో కుటుంబసమస్యల కారణంగా ఉలగనాథన్ కాంచీపురం జిల్లా కిళాయ్ గ్రామంలోని తండ్రి వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల మరో కుమార్తె సైతం ఉలగనాథన్ వద్దకు వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో భర్త తనను పట్టించుకోవడం లేదని, ఇటీవల మహిళా పోలీస్‌స్టేషన్‌లో జయంతి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి విచారించి, కౌనెలింగ్ ఇవ్వాల్సి వుంది. అయితే పోలీసులు ఇవేమీ చేయకపోవడంతో మంగళవారం మహిళ పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులను వివరణ కోరింది. అయితే పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ తనతోపాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మాహుతికి యత్నించింది. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన మహిళా పోలీసులు మహిళను అడ్డుకుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.