
ఆరుప్పడై వీడులకు కావళ్ల యాత్ర
● బీజేపీ భక్తి ప్రయాణం
సాక్షి, చైన్నె: తమిళ కడవుల్ మురుగన్ ఆశీస్సులతో ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆడిమాసంలో కావళ్లతో భక్తి పయనం ద్వారా ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు.. 2026 ఎన్నికల ద్వారా తమిళనాట అన్నాడీఎంకేతో కలిసి పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో భక్తి ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇప్పటికే మదురై వేదికగా జరిగిన తమిళ కడవుల్ మురుగన్ మహానాడుకు విశేష స్పందన రావడంతో హరోహర నినాదాన్ని జ్వళింప చేయడానికి కసరత్తు చేపట్టింది. ఈ మహానాడు రాజకీయాలకు అతీతం అని ప్రకటించినా, చివరకు రాజకీయ అంశాలకు వేదికగా మారింది. ఇది విమర్శలకు దారి తీసినా, జనం నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ఇక, మురుగన్ వేల్‌ను తమ చేతిలోకి తీసుకుని యాత్రలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆడిమాసం కావడంతో ఆడికృత్రిక సందర్భంగా మురుగన్ ఆలయాలకు కావళ్ల యాత్రకు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా తమిళ్ కడవుల్ మురుగన్‌కు ప్రసిద్ధి చెందిన ఆరుప్పడై వీడులుగా పిలవబడే ఆలయాలు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇందులో తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో జయంతి నాథర్ స్వామిగా, దిండుగల్ జిల్లా పళణిలోని దండాయుధపాణి, మదురై తిరుప్పరగుండ్రంలో సుబ్రమణ్యస్వామిగా, తంజావూరు జిల్లా స్వామిమలైలోని స్వామినాథన్‌గా, మదురై పళముదిర్ చోళైలో సోలై మలై మురుగన్, తిరుత్తణిలో మురుగన్ ఆలయాలకు కావళ్ల యాత్రకు సన్నద్ధం అవుతున్నారు. ప్రజల్ని ఏకం చేస్తూ, బీజేపీ వర్గాలు ఈ యాత్రకు సన్నద్ధం కానున్నాయి. ఇందుకు సంబంఽధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండురోజులలో వెలువడే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో ఇక, మురుగన్‌కు విశేష పర్వదినాలైన తైపూసం, స్కంధ సష్టి వంటి వేడుకలను తమకు అనుకూలంగా మలచుకుని భక్తి కార్యాక్రమాలకు కసరత్తు విస్తృతం చేసినట్టు చెబుతున్నారు. కాగా గతరెండు రోజులుగా తమిళనాట తూత్తుకుడి ప్రగతి ప్రాజెక్టులో, గంగై కొండ చోళపురంలో ఆధ్యాత్మిక, భక్తిభావం మిన్నంటే కార్యక్రమాలలో పీఎం మోదీ పాల్గొనడంతో కొత్త ఊపుతో ఉన్న బీజేపీ వర్గాలు, మరింత దూకుడుగా భక్తి మార్గంలో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.