
స్వరం మార్చిన పన్నీరు!
● నేడు మద్దతుదారులతో భేటీ ● కీలక నిర్ణయానికి అవకాశం
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వక పోవడంపై మాజీ సీఎం పన్నీరు సెల్వం గుర్రు మంటున్నారు. కేంద్రం తీరును ఎండగట్టే విధంగా రాష్ట్రానికి నిధుల కేటాయింపు వ్యవహారంపై స్వరంమార్చి గళాన్ని విప్పారు. బుధవారం మద్దతు దారులతో సమావేశానికి నిర్ణయించారు. వివరాలు.. తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు తనకు దక్కినట్టు దక్కి దూరం కావడాన్ని మాజీ సీఎం పన్నీరు సెల్వం జీర్ణించుకోలేకున్నారు. అన్నాడీఎంకేను కై వశం చేసుకునే ప్రయత్నాలు ఓ వైపు చేస్తూనే, మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో తాను ఉన్నట్టు ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చిన పన్నీరు సెల్వంకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఒత్తిడితోనే తనకు అనుమతి ఇవ్వన్నట్టుగా పన్నీరు గుర్తించినట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలతో ఇక బీజేపీ ఎన్‌డీఏ కూటమిలో ఎన్నికల సమయంలో ఇమడటం కష్టం అన్నది పన్నీరు గుర్తించినట్టున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ ఏర్పాటు ద్వారా తమిళగ వెట్రి కళగం నేత విజయ్ నేతృత్వంలోని కూటమిలో చేరడానికి కసరత్తు మొదలెట్టినట్టుగా ఆయన మద్దతు దారులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లూ కేంద్రానికి వంత పాడుతూ వచ్చిన పన్నీరు సెల్వం మంగళవారం రూటు మార్చారు. తమిళనాడుకు విద్యా తదితర నిధుల కేటాయింపులో నిర్లక్ష్యాన్ని వహిస్తున్న కేంద్రం తీరును ఎండగట్టే విధంగా, ఈ వ్యవహారంలో ప్రధానినరేంద్ర మోదీ మెతక వైఖరిని అనుసరిస్తున్నారన్నట్టుగా విమర్శలు, వ్యాఖ్యల తూటాలతో ప్రకటనను పన్నీరు సెల్వం విడుదల చేయడం గమనార్హం. ఇక, బీజేపీతో కటీఫ్ అన్నట్టుగా ఈ ప్రకటనను రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితులలో బుధవారంచైన్నెలో తన మద్దతు దారుల సమావేశానికి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు మద్దతు వర్గం పేర్కొంటోంది.