
రజనీకాంత్ చిత్రాలను గుర్తు చేసే ‘కింగ్‌డమ్’
తమిళసినిమా: నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననేని కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు భారీ ఎత్తున నిర్మించాయి. శ్రీకర స్టూడియోస్ సంస్థ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని,, గిరీష్ గంగాధరన్ జోమోన్ ఛాయా గ్రహణం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ( ఈ నెల 31వ తేదీన) తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ మంగళవారం ఉదయం చైన్నెలో నిర్వహించిన ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కింగ్డమ్ చిత్రాన్ని చేయాలని అనుకున్నప్పుడే తెలుగు తమిళ భాషల్లో నిర్మించాలని భావించామన్నారు. ఇది హై ఆక్టెన్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా కథా చిత్రంగా ఉంటుందన్నారు. తానిందులో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర నుంచి అండర్ గ్రౌండ్ స్పైగా మారే పాత్రలో నటించినట్లు చెప్పారు. చిత్ర కథా ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో మొదలై శ్రీలంకను టచ్ చేస్తుందని చెప్పారు. ఈ చిత్రంలో అనిరుధ్ శక్తివంతమైన సంగీతం, గిరీష్ గంగాధరన్, జోమోన్ ఛాయాగ్రహణం అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ ఈ చిత్రానికి 40 శాతం పని చేసిన తర్వాత రజనీకాంత్ నటిస్తున్న కూలి చిత్రానికి వెళ్లడంతో మిగిలిన చిత్రాన్ని జోమోన్ పూర్తి చేశారని చెప్పారు. కింగ్‌డమ్ చిత్రం రజనీకాంత్ చిత్రాలను గుర్తు చేస్తుందని అన్నారు. కాగా ఈ చిత్ర టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన నటుడు సూర్య అన్నయ్యకు ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రం కోసం ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న తాను ఆ తరువాత చైన్నెలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడతానని అన్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టానని, ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని విజయ్ దేవరకొండ వ్యక్తం చేశారు.
ప్రముఖ దర్శకులు, నటులతో 90స్ క్రేజీ కథానాయికలు