
గుమ్మిడిపూండిలో చిన్నారిపై లైంగిక వేధింపులు
● నిందితుడిపై దాడికి యత్నం ● కోర్టు ఆవరణలో ఉద్రిక్తత
తిరువళ్లూరు: పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తున్న చిన్నారిపై లైగింక దాడికి పాల్పడిన వ్యవహారంలో అరెస్టుయిన నిందితుడ్ని నాలుగు రోజుల పాటూ పోలీసు కస్టడికి ఇస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం నిందితుడ్ని బయటకు తీసుకొచ్చే సమయంలో కొందరు మహిళలు, న్యాయవాదులు దాడికి యత్నించడం, పోలీసులు వారిని అడ్డుకుని తోసేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని ఆరంబాక్కం ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక ఈనెల 12న పాఠశాల ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అయితే లైగింక దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించే విషయంలో పోలీసులకు సవాలుగా మారింది. దాదాపు 13 రోజుల పాటూ గాలించిన పోలీసులు నెల్లూరు జిల్లా సూళూరుపేట రైల్వేస్టేషన్‌లో నిందితుడ్ని అరెస్టు చేశారు. అరెస్టుయిన తరువాత దాదాపు 48 గంటల పాటూ రహాస్యంగా వుంచి విచారణ చేపట్టిన పోలీసులు నెల్లూరు, ఆరంబాక్కం తదితర ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్లి విచారణ చేపట్టారు. గత శనివారం పూందమల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్లి హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన క్రమంలో పుళల్ జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో బాలికపై లైగింక దాడికి పాల్పడిన యువకుడు ఒడిశాకు చెందిన రాజూబిష్మవర్మ(35)గా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ సోమవారం పోక్సో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కేసు విచారణలో భాగంగా మంగళవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ నిందితుడ్ని తిరువళ్లూరు న్యాయస్థానానికి తీసుకొచ్చారు. కేసును న్యాయమూర్తి ఉమామహేశ్వరి విచారణ చేపట్టారు. అనంతరం నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ తీర్పును వెలువరించారు.
దాడికి యత్నం
బుధవారం నుంచి నాలుగు రోజుల పాటూ పోలీసు కస్టడి విచారణకు కోర్టు అనుమతి ఇచ్చిన క్రమంలో నిందితుడ్ని భారీ పోలీసు బందోబస్తు నడుమ పుళల్ జైలుకు తరలించారు. ఈ సమయంలో కొందరు న్యాయవాదులు దాడికి యత్నించారు. పోలీసులు అసలైన నిందితుడ్ని అరెస్టు చేయలేదని నినాదాలు చేశారు. దీంతో పాటు అక్కడే వున్న మరికొందరు మహిళలు సైతం నిందితుడిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఉద్రిక్తతల మధ్య పోలీసులు నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు.

గుమ్మిడిపూండిలో చిన్నారిపై లైంగిక వేధింపులు