
క్లుప్తంగా
తుపాకుల పనితీరు పరిశీలన
సేలం : సేలం జిల్లా పోలీసు విభాగంలో ఉపయోగించే తుపాకీలలో మూడింట ఒక వంతు వార్షిక తనిఖీలు మంగళవారం చేపట్టారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్మాల్ ఆర్‌మ్స్ కరుపుసామి నేతృత్వంలోని అధికారులు రైఫిల్స్‌ను తనిఖీ చేసి, వాటికి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించారు. ఇందులో 303, ఎస్‌ఎల్‌ఎ, ఎకె 47, ఐఎన్‌ఎస్‌ఎఎస్, స్నిపర్ సహా 500 రైఫిళ్లను పరిశీలించినట్లు వెల్లడించారు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో..
– బ్రెయిన్ డెడ్ అయిన కార్మికుడి
అవయవాల దానం
అన్నానగర్: తిరువళ్లూరు జిల్లా సెవ్వపేటైకి చెందిన 49 ఏళ్ల దినసరి కూలీ 22వ తేదీన ఆరణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం చైన్నెలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స ఫలించకపోవడంతో 24వ తేదీన ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీని తర్వాత, ఆయన కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. దీని తర్వాత, ఆయన రెండు మూత్రపిండాలు, ఎముకలు, చర్మం, కాలేయం, కళ్లను తొలగించి దానం చేశారు. ఓ మూత్రపిండాన్ని వడపళనిలోని ఓ రోగికి, మరో మూత్రపిండాన్ని అల్వార్పేటైలోని మరో రోగికి మార్పిడి చేశారు. కాలేయాన్ని కోవిలంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. చైన్నెలోని ఎగుంపూర్ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కళ్లను మార్పిడి చేశారు. ఎముకలను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి, చర్మాన్ని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశారు. ఈ అవయవ దానం ద్వారా ఏడుగురికి పునర్జన్మ కల్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అవయవ దానం చేసిన కార్మికుడి మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
నామక్కల్‌లో 7 చోట్ల
సీబీసీఐడీ తనిఖీలు
తిరువొత్తియూరు: నామక్కల్ తిరునగర్‌కు చెందిన పళనిస్వామి (77) ఫైనాన్స్ సంస్థ యజమాని. ఇతను తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నామక్కల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో 4 పేజీల లేఖ లభ్యమైంది. అందులో ఆయన మరణానికి నలుగురు కారణమని రాసి ఉంది. కాగా ఆత్మహత్య చేసుకున్న పళనిస్వామి భార్య వసంత, నామక్కల్ పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తదనంతరం, ఈ కేసును దర్యాప్తు చేయాలని కోర్టు సీబీసీఐడీ పోలీసులను ఆదేశించింది. దీని ప్రకారం, పళనిస్వామిని ఆత్మహత్యకు ప్రేరేపించబడినట్టు సీబీసీఐడీ పోలీసులు అభియోగం మోపారు. ఆర్థిక సంస్థ యజమానులు సెల్వరాజ్, శేఖరన్ ఇద్దరు న్యాయవాదులపై మొదటి చార్జీ సీటు దాఖలు చేశారు. పోలీసులు కొనసాగిస్తున్న దర్యాప్తులో ఓ న్యాయవాది రూ.85 లక్షల విలువైన భూమిని లిఖితపూర్వకంగా రాసి తీసుకున్నట్టు తెలిసింది. పళనిస్వామి మరణం తర్వాత ఆ భూమి పత్రాలను తన నుంచి స్వాధీనం చేసుకుని తన భార్యకు ఇవ్వాలని లేఖలో రాసినట్లు సీబీసీఐడీ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సీబీసీఐడీ డీఎస్పీ వినోద్ నేతృత్వంలో పోలీసులు కలెక్టర్ కార్యాలయం సమీపంలో వున్న న్యాయవాది కార్యాలయం, న్యాయవాది ఇల్లు సహా ఏడు ప్రదేశాలలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఇందులో కీలక పాత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.