
తమిళులు, మలయాళీల చరిత్రను తెలిపే వీర వణక్కం
తమిళసినిమా: నటుడు, దర్శకుడు సముద్రఖని, భరత్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వీరవణక్కం. శారద్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు అనిల్ వి.నాగేంద్రన్ కథ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈయన దర్శకత్వం వహించిన తొలి తమిళ చిత్రం ఇది. ఇందులో నటుడు రితేశ్, జాతీయ అవార్డు గ్రహీత సురభిలక్ష్మి, విప్లవ గాయనీ, స్వాతంత్య్ర యోధురాలు పీకే.మేదిని, భరణి, ఐశ్విక, సిద్ధిక్, ఆకాశ్ దేవన్, చత్తాంగణ తదితరులతో పాటూ మొత్తం 2000 మందికి పైగా ప్రముఖ, నూతన నటీనటులు నటించినట్లు దర్శకుడు తెలిపారు. అణిచివేతకు గురైన, ఆకలి పస్తులతో బతికే కార్మికులకు, దోచుకునే సమాజానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథ అని చెప్పారు. అదే విధంగా తమిళులు, మలయాళీలు ఒక తల్లిబిడ్డలే అని చెప్పే మంచి సందేశంతో కూడిన చిత్రం అని చెప్పారు. కవియరసు ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్‌లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఇందులోని మూడు పాటలను శారద్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్‌లో ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణను పొందాయని చెప్పారు. అదూ విధంగా చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేయగా సినీ ప్రముఖులు, విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించినట్లు చెప్పారు. కాగా చిత్ర టీజర్,ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు.
వీరవణక్కం చిత్రంలో సముద్రఖని