
ఘనంగా అన్నామలైయార్‌కు తీర్థవారి
వేలూరు: పంచ భూత స్థలాల్లో అగ్ని స్థలమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అన్నామలైయార్‌కు ఆలయ కోనేటిలో తీర్థవారి నిర్వహించారు. అన్నామలైయార్ ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు 14 కిలో మీటరు దూరం ఉన్న గిరివలయం రోడ్డులో కాలి నడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉండగా ఆలయంలో ఏటా ఆడి మాసంలో నిర్వహించే ఆడిపుర బ్రహ్మోత్సవాలు ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత పది రోజులుగా స్వామివార్లు ఉదయం, సాయంత్రం వేలల్లో మాడ వీధుల్లో భక్తులకు వివిధ పుష్పాలంకరణల మధ్య దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలు ముగియడంతో గత పది రోజులుగా అలసి పోయిన స్వామివార్లుకు ఆలయ వెనుక ఉన్న నాల్గవ ప్రాకారం చిన్న నంది సమీపంలో ఉన్న బ్రహ్మ తీర్థ కోనేటిలో శివాచార్యులు వేద మంత్రాల నడుమ స్వామి వారికి తీర్థవారి నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, దీపారధన పూజలు జరిపించారు. ఆలయానికి తీసుకొచ్చి పుష్పాలంకరణలు చేశారు. అనంతరం పరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులతో గాజులు వేసే పూజలను నిర్వహించి, మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం మేళ తాళాల నడుమ ఊరేగించారు.

ఘనంగా అన్నామలైయార్‌కు తీర్థవారి