
కుట్రం కడిదల్ సీక్వెల్‌కు శ్రీకారం
తమిళసినిమా: జేఎస్‌కే ప్రొడక్షన్స్ సంస్థ అధినేత జేఎస్‌కే సతీష్‌కుమార్ ఇంతకు ముందు తరమణి, కుట్రం కడిదల్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. పలువురు దర్శకులు, నటీనటులు, సాంకేతిక వర్గానికి అవకాశాలు కల్పించిన ఈయన తరమణి, పేరంబు,వంటి పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇటీవల ఫైర్ అనే చిత్రంలో కథానాయకుడిగానూ నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించి విజయాన్ని సాధించారు. కాగా జేఎస్‌కే 2023లో నిర్మించిన కుట్రం కడిదల్ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆ చిత్రానికి తాజాగా సీక్వెల్‌ను చేస్తున్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రను పోషించడం విశేషం. పుదుమైపిత్తన్, వళ్లీ చిత్రాల దర్శకుడు, అనీతి, తలమై చెయల్ వెబ్ సిరీస్‌లకు మాటల రచయితగా పని చేసిన ఎస్‌కే.జీవా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కుట్రం కడిదల్ –2 చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నటుడు జేఎస్‌కే వివరాలు తెలుపుతూ ఓ 60 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడి జీవిత వృత్తాంతమే ఈ చిత్ర కథ అని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకున్న ఆయనకు ఆ తరువాత జరిగిన ఒక సంఘటన కారణంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు, ఆ ఘటన ఏమిటీ తదితర పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం కుట్రం కడిదల్–2 అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో జేఎస్‌కే.సతీశ్‌కుమార్‌తో పాటూ పాండియరాజన్, అప్పుకుట్టి, బాలాజీ మురుగదాస్, దీపక్, పద్మన్, పీఎల్.తేనప్పన్, చాందిని తమిళరసన్, కీర్తిచావ్లా, వీజీ చంద్రశేఖర్, లవ్విన్, జోవితా, లివింగ్‌స్టన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి డీకే సంగీతాన్ని, సతీష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.