
మాజీ సైనికుల కుటుంబాల నిరసన
● పట్టాలు ఇవ్వకుంటే ఆగస్టు 15న నల్లజెండాలు ఎగురవేస్తామని హెచ్చరిక
తిరువళ్లూరు: రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధంలో 1939–45 వరకు జిల్లా నుంచి 60 మంది సైనికులు పాల్గొన్నారు. వీరికి విశ్రాంతి పొందిన తరువాత పింఛన్ లేకపోవడంతో జీవన ఆధారం కోసం ప్రతి సైనికుడికి ఆరు ఎకరాల భూమి, మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించిన జీఓ 1980, 2004లో జారీ చేశారు. ప్రస్తుతం మాజీ సైనికులకు కేటాయించిన భూములు, ఇంటి స్థలం మాజీ సైనికుల ఆధీనంలో ఉన్నా ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో మాజీ సైనికులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పట్టాలను ఆరు నెలల్లో మంజూరు చేయాలని ఆదేశించింది. అయితే ఇంత వరకు పట్టాలు మంజూరు కాకపోవడంతో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, వారసులు కలిసి సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్‌కు వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆగస్టు 15న తమ ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.