
వైద్య రంగంలో నర్సుల సేవలు అజరామరం
● ఉత్తమ నర్సులకు జీవత సాఫల్య పురస్కారాలు ● ప్రదానం చేసిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
సాక్షి, చైన్నె: వైద్య రంగంలో నర్సుల సేవలు అజరామరం అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు నర్సింగ్, మిడ్ వైవ్స్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాలలో సోమవారం 22 మంది నర్సులకు 2025 సంవత్సరానికి ఉత్తమ నర్సు, జీవిత సాఫల్య పురస్కారాలను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. వళ్లువర్ కోట్టంలో జరిగిన శతాబ్ది ఉత్సవాలకు ఉదయనిధి, ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణియన్ హాజరయ్యారు. శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవ లోగో, క్యాలెండర్‌ను విడుదల చేశారు. 22 మంది ఉత్తమ నర్సులకు జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగింస్తూ, మిడ్‌వైవ్స్ కౌన్సిల్ శతాబ్ది ఉత్సవాలలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది తనకు దక్కిన గౌరవంగా వ్యాఖ్యానించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి నర్సు ముఖం చూసినప్పుడు, తనకు ఎంతో ఆత్మవిశ్వాసం, భద్రత కలుగుతుందన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ తన సొంత తల్లి ముఖాన్ని చూసే ముందు, ఇక్కడికి వచ్చిన నర్సుల ముఖాన్ని చూస్తారని , వీరి సేవలు అజరామరం అని వ్యాఖ్యలు చేశారు. నర్సులను ఇక్కడ కలవడం తనకు ఎ ంతో గర్వంగా ఉందన్నారు. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి ఆసుపత్రిలో ఉన్నారని గుర్తు చేస్తూ, ఆయన ఇప్పుడు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారన్నారు. ఆయనకు వైద్య సేవలు, చికిత్సలు అందించిన వైద్యులకు, ముఖ్యంగా నర్సులకు ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టీకాలు వేయడం చాలా చాలా ముఖ్యం అని గుర్తు చేస్తూ, ఒకప్పుడు వైద్యులు, నర్సులు టీకాలు వేయడానికి వెళ్లినప్పుడు వారిని తరిమికొట్టేవారన్నారు. ఇప్పుడు నర్సింగ్ సమాజం అలాంటి వ్యక్తులకు అర్థమయ్యేలా చేసి టీకాలు వేయించడం, వ్యాధుల వ్యాప్తి నిరోధించడంలో ముందున్నారని కొనియాడారు.
ప్రాణాలను సైతం అర్పించారు
తమిళనాడులో అనేక వ్యాధులు వ్యాపించి, అతలాకుతలం చేసినప్పుడు, ముందు వరుసలో నిలిచి సేవలు అందించిన వాళ్లు నర్సింగ్ సమాజం అని వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో అనేక మందినర్సులు కుటుంబాలను, పిల్లలను వదలి పెట్టి సేవలు అందించారని, తమ ప్రాణాలను కూడా అర్పించారని వ్యాఖ్యలు చేశారు.‘శిక్షణ పొందిన నర్సులు ఆధునిక ప్రజారోగ్యానికి మూలస్తంభం, ‘శిక్షణ పొందిన నర్సులు ఆధునిక ప్రజారోగ్యానికి పునాది‘ అని ప్రశంసించారు. తమిళనాడులో నేడు గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాలు అద్భుతంగా సేవలు అందించడానికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారి సేవలేనని ఆయన పేర్కొన్నారు.