
తిరుత్తణిలో ఆడి పూజల కోలాహలం
● కావళ్లతో మార్మోగిన కొండ ఆలయం ● ఉత్సవర్లకు 1008 బిందెలతో పాలాభిషేకం
తిరుత్తణి: ఆడి మాసం సందర్భంగా తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి కొండ ఆలయంలో సోమవారం కావళ్ల సవ్వళ్లు మార్మోగాయి. ఉత్సవర్లకు 1008 పాల బిందెలతో అభిషేకం నిర్వహించి, భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఆడిప్పూరం సందర్భంగా వేకువజామున స్వామికి అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచంతో అలంకరించి, మహాదీపారాధన పూజలు చేపట్టారు. చైన్నెలోని పలు ప్రాంతాల నుంచి ఆడిప్పూరం సందర్భంగా భక్తులు కొండ ఆలయానికి పోటెత్తారు. మెట్లు మార్గంలో కొండ ఆలయం చేరుకున్న భక్తులు నెమలి కావళ్లు, పన్నీరు కావళ్లు, పాల కావళ్లు, ఆలయ మాడ వీధులు హరోంహర నామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా భక్తులు మురుగన్ ఆధ్యాత్మిక పాటలు పాడుతూ మేళతాళాలతో సందడి చేశారు. అదే విధంగా ఉదయం 10 గంటలకు కావడి మండపంలో 1008 పాల బిందెలతో ఉత్సవర్లకు పాలాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో కావళ్లతో భక్తులు కొండకు చేరుకోవడంతో స్వామి దర్శనానికి భారీ క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామికి కావళ్లు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల్లో చాలామంది శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చుకుని, దవడకు శూలం గుచ్చుకుని పాదాలకు ఇనుప కడ్డీల పాదరక్షలు ధరించి మాడ వీధుల్లో ఆలయానికి వెళ్లి, స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుత్తణిలో ఆడి పూజల కోలాహలం