
తీరంలో మాంగ్రూవ్ అడవుల పెంపకానికి శ్రీకారం
సాక్షి, చైన్నె: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగం, ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఫర్‌కోస్టల్ రీసెర్చ్, తమిళనాడు అటవీ శాఖ, మాంగ్రూవ్ ఫౌండేషన్, 4ఐ యాప్స్ సొల్యూషన్స్‌లు కలిసి కోవలం సముద్ర తీరంలో చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. అటవీ దినోత్సవ 2025 కార్యక్రమాలలో భాగంగా కోవలం తీరంలో మాంగ్రూవ్ (మడ అడవులు) మొక్కలను పెద్దఎత్తున నాటారు. వీటిని సంరక్షించే విధంగా మాంగ్రూవ్ సప్లింగ్ ప్లాంటేషన్ డ్రైవ్‌కు చర్యలు తీసుకున్నారు.ఎన్‌సీసీఆర్ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌ఎస్ కంకర, ఫారెస్ట్ కోస్టల్ సెక్యూరిటీ అధికారి పొన్ సెంథిల్, ఓఎస్‌ఐ చైన్నె చాప్టర్ ప్రతినిధులు, శాస్త్ర వేత్తలు డాక్టర్ ట్యూన్ ఉష, జోసియా జోసెఫ్, తిరుమురుగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చి మొక్కలను కోవలం సముద్ర తీరంలో నాటారు. వీటిని సంరక్షించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
పట్రపెరంబదూరులో రాస్తారోకో
– క్వారీ వద్ద లారీలను అడ్డుకుని ఆందోళన
తిరువళ్లూరు:పట్రపెరంబదూరు చెరువులో ప్రభు త్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీలను అడ్డుకుని సోమవారం ఉదయం నిరసన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా పట్రపెరంబదూరు గ్రామంలో సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువు ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెరువులో మరమ్మతులు, పూడికతీత చేపట్టాలన్న ఉద్దేశంతోనే గత పది రోజుల క్రితం క్వారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడు అడుగుల మేరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. లారీలో అధికంగా మట్టిని లోడ్ చేయకూడదన్న నిబంధనలతో అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి మట్టిని తరలిస్తున్నట్టు ఆరోపిస్తూ గ్రామస్తులు సోమవారం లారీలను అడ్డుకుని క్వారీ వద్ద నిరసన చేపట్టారు. దీంతో క్వారీలో రెవెన్యూ అధికారులుతాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేశారు.