
రాజేంద్ర చోళుడే మోదీ రూపంలో వచ్చినట్లుంది
● గంగై కొండ చోళపురం శివాచార్యుల వ్యాఖ్య
సాక్షి, చైన్నె: రాజేంద్ర చోళుడే స్వయంగా పీఎం మోదీ రూపంలో వచ్చినట్టుగా తనకు భావన కలిగిందని గంగై కొండ చోళపురం ఆలయ శివాచార్యులు రాజగురు వ్యాఖ్యానించారు. అరియలూరు జిల్లా గంగై కొండ చోళపురంలో జరిగిన ఆడి తిరువాధిరై ఉత్సవాల గురించి తెలిసిందే. ఆదివారం జరిగిన ముగింపు వేడకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. గంగై కొండ చోళపురంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కలసం చేత బట్టి ఆయన ఆలయంలోకి రావడం, స్వయంగా దీపారాధన చేయడం, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అంశాలను గురించి అక్కడి శివాచార్యులు పలువురు మీడియా ముందుకు వచ్చి సోమవారం వివరించారు. రాజగురు మాట్లాడుతూ తాను 30 సంవత్సరాలుగా ఆలయంలో శివుడికి పూజలు చేస్తూ వస్తున్నానని తెలిపారు. ఏటా ఉత్సవాలు జరుగుతున్నా, ఈ సంవత్సరం ఆడి తిరువాధిరై వేడుకలకు ప్రధాని వస్తున్న సమాచారం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. కలలోకూడా తాను ఊహించ లేదని, ప్రధాని నరేంద్ర మోదీ తమతో మాట్లాడారని, ఆలయం వైభవం గురించి అడిగి తెలుసుకున్నారని, ఈ సమయంలో ఆయన ముఖంలో ఆనందం కనిపించిందన్నారు. ఈ సమయంలో ఆయన చిరునవ్వులు చూసి రాజేంద్ర చోళుడే ప్రధాని మోదీ రూపంలో వచ్చినట్టుగా తన్మయత్వం కలిగిందన్నారు. ఆయనకు తిలకం దిద్దే భాగ్యం తనకు దక్కడం జీవితంలో గొప్ప వరంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.