
పిల్లల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న మంత్రి గీతాజీవన్
● మంత్రి గీతాజీవన్
తిరువళ్లూరు: పిల్లలను సంరక్షించడంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర సాంఘిక, శిశు మహిళా సంక్షేమశాఖ మంత్రి గీతా జీవన్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని పాంజాలై గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లల సంరక్షణ కేంద్రాన్ని 39 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గది, టాయ్‌లెట్లు, హాస్టల్, వంటగదిని పరిశీలించారు. కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న ఆహారం, విద్య, వైద్యసదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 86 మంది పిల్లలు ఉన్నారని, మరో 110 మంది పిల్లలకు సరిపడా సదుపాయాలు ఉన్నాయని నిర్వాహకులు మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ పిల్లల సంరక్షణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, దీంతో పాటు మహిళ శిశుసంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నామని, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే టీజే గోవిందరాజన్, జెడ్పీ చైర్‌పర్సన్ ఉమామహేశ్వరి, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి సుమతి పాల్గొన్నారు.
వ్యవసాయ విస్తరణ కేంద్రాల్లో తనిఖీలు..
స్వర్ణవారి సాగుబడి చేయడానికి రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ విస్తరణ కేంద్రాల్లో వరి విత్తనాలు, ఎరువులు, పురుగులమందు నిల్వపై కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈకాడులోని వ్యవసాయ విస్తరణ కేంద్రంలో తనిఖీ చేపట్టిన కలెక్టర్, వరివిత్తనాలు, రైతుల వివరాలు, పురుగుల మందు నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్‌లో పేర్లు, భూమి వివరాలను ఇంకా నమోదు చేసుకోని రైతులను గుర్తించి వెంటనే వారి పేర్లును నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం తామరపాక్కం వరి ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎబినేజర్, రీజినల్ మేనేజర్ శేఖర్ పాల్గొన్నారు.