
సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలి
తమిళసినిమా: బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షోతో పాపులర్ అయిన నటుడు ముగెన్ రావ్. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం జిన్. భవ్య ట్రిఖా నాయకిగా నటించిన ఇందులో రాధారవి, బాలా శరవణన్, ఇమాన్ అన్నాచ్చి, నందు ఆనంద్, వడివుక్కరసి, నిళల్ గళ్ రవి, వినోదిని జార్జ్ విజయ్, రిత్విక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఫెయిరీ టేల్ పిక్చర్స్, ఏఆర్.టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి టీఆర్ బాలా దర్శక నిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు.వివేక్–మెర్విన్ లో ద్వయం సంగీతాన్ని అందించిన జిన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఇందులో ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, ఆర్ వీ.ఉదయ్ కుమార్,పేరరసు, జాగ్వర్ తంగం మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిత్ర ఆడియోను విడుదల చేసిన అనంతరం ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ ‘‘నిర్మాతల సంఘం సభ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మునిగిపోతున్న నావలా మారింది.సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి సంఘం నిర్వాహకులు కృషి చేయాలి. నిర్మాతలు బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. కార్మికులకు పని ఉంటుందని భావించే వ్యక్తిని నేను. అయితే నిర్మాతల సంఘానికి చెందిన కొందరు స్వార్థపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విధానం మారాలి. తాను తన కార్మికుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తాను. నా చర్యల్లో తప్పు ఉంటే ఈ వేదికపై ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత, పూర్వ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, పూర్వ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కేఆర్ ఉన్నారు. ఆయన చెబితే సరిదిద్దుకోవడానికి నేను సిద్ధం’’ అని అన్నారు. ఇకపోతే ‘‘జిన్ చిత్రం ట్రైలర్ బాగుంది.పొటలు ఇంకా బాగున్నాయి. చిత్ర దర్శక నిర్మాత టీఆర్.బాలాకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు.