
విక్రమ్‌తో జత కుదిరేనా?
తమిళసినిమా: వైవిధ్య భరిత కథాచిత్రాలకు కేరాఫ్ చియాన్ విక్రమ్. ఈయన తాను నటించే ప్రతి చిత్రంలోనూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఇటీవల తంగలాన్, వీర ధీర సూరన్ చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా తాజాగా విక్రం తన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి మడోనా అశ్విన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు మండేలా, మావీరన్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రాన్ని శాంతి పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సంస్థ ఇంతకుముందు శివకార్తికేయన్ కథానాయకుడిగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. కాగా తాజాగా విక్రమ్ హీరోగా నిర్మించే చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో విక్రమ్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నటి ప్రియాంక మోహన్, అలాగే శ్రీనిధిశెట్టిలలో ఒకరు నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కాగా తాజాగా లక్కీ కథానాయకి మీనాక్షి చౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కన్నడ బ్యూటీ ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో మంచి రేసింగ్‌లో ఉన్నారు. ఈమె ఇంతకు ముందు తమిళ్, తెలుగు భాషల్లో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాగే వెంకటేష్ సరసన నటించిన తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ప్రస్తుతం ఈమె క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. కాగా మరోసారి తమిళంలో విక్రమ్‌తో జత కట్టడానికి రెడీ అవుతారా? అన్నది వేచి చూడాలి.
నటి మీనాక్షి చౌదరి