
అబ్దుల్ కలామ్ బయోపిక్‌లో ధనుష్
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాల అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న అతి కొద్ది మంది నటుల్లో ధనుష్ ఒకరు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించే సత్తా కలిగిన నటుడు ధనుష్. ఈయన తన వయసుకు మించిన పాత్రల్లో నైనా నటించగలరని అసురన్, కెప్టెన్ మిల్లర్ చిత్రాలు నిరూపించాయి. కాగా ఆ మధ్య సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అయ్యారు. అయితే దానికి సంబంధించిన అప్ డేట్ ఇంకా రాలేదు. కాగా తాజాగా దివంగత ప్రఖ్యాత శాస్త్రవేత్త, పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అబ్దుల్ కలామ్ రాసిన అగ్ని సిరైగల్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఆదిపురుష్ చిత్రం ఫేమ్ ఓం రావత్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి కలామ్ మిసైల్ మెన్ ఆఫ్ ఇండియా అనే పేరును నిర్ణయించారు. ఇది కచ్చితంగా పాన్ వరల్డ్ చిత్రం అవుతుంది. కాగా ఈ చిత్రాన్ని ఇంతకు ముందు కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్, టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్‌కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. దీని గురించి చిత్ర వర్గాలు కాస్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ప్రకటించారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుంది? ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రం జూన్ నెల 20వ తేదీన తెరపైకి రానుంది. ఆ తరువాత ఆయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఒక హిందీ చిత్రంలో నటిస్తున్న ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అబ్దుల్ కలాం బయోపిక్‌లో నటించే చిత్రం ఎప్పుడు సెట్ పైకి వెళ్లనుందన్న అంశం ఆసక్తిగా మారింది.