
రోబోటిక్ సర్జరీలో కొత్త ఒరవడి
● ఐదేళ్ల బాలుడికి రోబోటిక్‌తో కాలేయ మార్పిడి
సాక్షి,చైన్నె: రోబోటిక్ సర్జరీలో సరికొత్త ఒరవడిని చైన్నెలోని రెలా ఆస్పత్రి సృష్టించింది. ఐదేళ్ల బాలుడికి ప్రపథమంగా రోబోటిక్ విధానంలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయంతంచేశారు. ఐదు సంవత్సరాల చిన్నారికి రోబోటిక్ లివర్ ట్రానన్స్‌ప్లాంట్‌ను ఇంత వరకు ఎక్కడా జరగలేదని, ఈ చారిత్రాత్మక శస్త్రచికిత్స రోబోటిక్, పీడియాట్రిక్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ రంగంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని డాక్టర్ మహ్మద్ రెలా ప్రకటించారు. అత్యాధునిక సాంకేతికతను సంక్లిష్ట శస్త్రచికిత్స నైపుణ్యంతో కలిపి మెరుగైన ఫలితాలను సాధించామన్నారు. గురువారం చైన్నెలో ఈ శస్త్ర చికిత్స గురించి డాక్టర్ రెలా మాట్లాడుతూ యూరియా సైకిల్ డిఫెక్ట్ అనే అరుదైన జన్యు పరమైన సమస్యతో బాధ పడుతున్న ఐదు సంవత్సరాల బాలుడికి ఆహారం నుంచి ప్రోటీన్లను కాలేయం సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోవడంతో రక్తంలో అమ్మోనియా హానికరంగా పేరుకుపోతూ రావడాన్నిగుర్తించామన్నారు. ఈ పరిస్థితుల్లో మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తూ వచ్చిందని,చివరకు కాలేయ మార్పిడికి నిర్ణయించామన్నారు.
రోబోటిక్ విధానంతో..
కాలేయ మార్పిడి కచ్చితమైన నివారణను అందించిందన్నారు. శస్త్రచికిత్స ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా సాగి, బాలుడిని వారంలోనే డిశ్చార్జ్ చేశామన్నారు. సాధారణంగా సాంప్రదాయిక విధానంలో రోగి 14 నుంచి 21 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందన్నారు. అయితే, తాము ప్రపథమంగా రోబోటిక్ సర్జరీని ఒక పిల్లవాడిపై నిర్వహించి విజయం సాధించామన్నారు. దాతగా ఉన్న ఆ బాలుడి తల్లికి సైతం శస్త్ర చికిత్స రోబోటిక్ విధానంలోనే జరిగిందన్నారు. రోబొటిక్ ద్వారా తల్లి నుంచి సేకరించి కాలేయం కొంత భాగాన్ని అదే విధానంతో ఆ బాలుడికి అమర్చి విజయవంతంచేశామన్నారు. రోబోటిక్ విధానం కారణంగా ఐదు రోజులలోనే డిశ్చార్జ్ చేశామన్నారు. రోబోటిక్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి పిల్లల కాలేయ మార్పిడి విజయవంతంగా నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారిగా పేర్కొంటూ ఇది శస్త్రచికిత్స రంగంలోనే ఒక ప్రధాన మైలురాయి అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో క్లినికల్ లీడ్ , సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ రాజలింగం సీనియర్ కన్సల్టెంట్– పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ – హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ నరేష్ షణ్ముగంలతో పాటుగా ఆ బాలుడు, అతడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.