టాస్మాక్ దుకాణం వద్దని వినతి
తిరువళ్లూరు: ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఏర్పాటు చేసిన టాస్మాక్ దుకాణాన్ని వెంటనే తొలగించాలని కోరుతూ పీఎంకే నేతలు స్థానికులతో కలిసి కలెక్టర్ ప్రతాప్‌కు వినతిపత్రం సమర్పించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి యూనియన్ పట్టాభిరామపురం గ్రామంలో ప్రభుత్వ టాస్మాక్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సమీపంలో దుకాణం ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్న క్రమంలో టాస్మాక్ దుకాణం ఏర్పాటు చేయవద్దని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. అయితే గురువారం భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి దుకాణాన్ని ప్రారంభించారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్‌కు పీఎంకే నేతలతో కలిసి స్థానికులు వినతిపత్రం సమర్పించారు. టాస్మాక్ దుకాణాన్ని తొలగించకుంటే ఆందోళననూ ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తిరుత్తణిలో...
తిరుత్తణి: తిరుత్తణి శివారు చైన్నె తిరుపతి జాతీయ రహదారి ప్రాంతం పట్టాభిరామాపురం పంచాయతీ పరిధిలో గొళ్లకుప్పం ప్రాంతంలోని టాస్మాక్ మద్యం షాపును కొత్తగా మార్చి ఉంచారు. అయితే తమ ప్రాంతంలో మద్యం షాపు ప్రారంభానికి అనుమతించబోమని పట్టాభిరామాపురం ప్రాంతం ప్రజలు రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈక్రమంలో గురువారం డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు టాస్మాక్ దుకాణం వద్ద మొహరించారు. దీంతో అక్కడ హడావుడి చోటుచేసుకుంది. అనుమతి మీరి టాస్మాక్ దుకాణం వద్ద పోరాటం చేపడితే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరికతో గ్రామీణులు పోరాటం నిర్ణయాన్ని వాయిదా వేశారు.


