రామన్నపేట : శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ప్రజలు జీవితాల్లో మార్పు తీసుకురావడానికి దోహదపడాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో రూ.2కోట్లతో నిర్మించిన ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఈటీఎఫ్)ను సోమవారం గ్రామ పంచాయతీకి అప్పగించారు. అనంతరం ఆయన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్లాంట్ పనితీరును పరిశీలించారు. పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో బ్యాక్టీరియా సహయంతో నీటిని శుద్ధి చేయనున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. ఐఐసీటీ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా సిరిపురం పేరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న చేనేత పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల రసాయన జలాలు శుద్ధి అయ్యి కాలుష్యం తగ్గడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల వారు సిరిపురం మోడల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని తెలిపారు. ప్లాంట్ నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐఐసీటీ డైరెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సిరిపురంలో ఏర్పాటు చేసిన ఈటీపీ దేశంలోనే మొట్టమొదటిదని తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ ఈటీపీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తుందని, సిరిపురం మోడల్ ప్లాంట్ పేరుతోనే ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ వారు శాస్త్రవేత్తలను సన్మానించారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎస్‌టీ డైరెక్టర్ రఘురాంరెడ్డి, ప్లాంట్ ప్రధాన పరిశోధకుడు వెంకట్‌మోహన్, శాస్త్రవేత్త కిరణ్‌కుమార్, సర్పంచ్ అంబటి ఉపేంద్రరవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఎం. అనూష, మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, తహసీల్దార్ లాల్‌బహదూర్‌శాస్త్రి, ఎంపీడీఓ రాములు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మిర్యాల భాస్కర్, మాజీ ఎంపీటీసీలు బడుగు రమేష్, పున్న వెంకటేశం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ వేముల వీరేశం
సిరిపురంలో నిర్మించిన ‘ఈటీఎఫ్’ గ్రామ పంచాయతీకి అప్పగింత


