గుంటల్లో రిజిస్ట్రేషన్‌ ! | - | Sakshi
Sakshi News home page

గుంటల్లో రిజిస్ట్రేషన్‌ !

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

న్యూస్‌రీల్‌

గజాల్లో అమ్మకం..

మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2026

చిలుకూరు : కోదాడ–హుజూర్‌నగర్‌ రహదారి వెంట చిలుకూరు మండల కేంద్రం పరిధిలో అనుమతి లేకుండానే అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. చిలుకూరు సమీపంలోని జానకీనగర్‌ స్టేజీ దగ్గర సుమారుగా రెండు ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటీవల ఓ వెంచర్‌ ఏర్పాటు చేశారు. వెంచర్‌ను 15 ప్లాట్లుగా మార్చి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ప్లాట్లను గజాల్లో అమ్ముతూ.. రిజిస్ట్రేషన్‌ మాత్రం గుంటల్లో చేస్తున్నారు. ఇక, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మాత్రం గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు.

నిబంధనలు ఇలా..

నిబంధనల ప్రకారం వెంచర్‌ ఏర్పాటు చేయాలంటే ముందస్తుగా గ్రామ పంచాయతీ (జీపీ) అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత గ్రామ పంచాయతీ అవసరాల కోసం 10 శాతం భూమి కేటాయించాలి, జీపీ తీర్మానం ప్రకారం డిస్ట్రిక్ట్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అనుమతి తీసుకున్న తరువాతనే భూమిని ప్లాట్లుగా చేసి విక్రయాలు మొదలుపెట్టాలి. ఆ తరువాత కూడా జీపీ అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా ఇక్కడ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరా భూమి అంటే 4,840 గజాలుగా లెక్కిస్తారు. అంటే ఇందులో ఎకరాకు పది శాతం (484 గజాలు) పంచాయతీకి అప్పగించాల్సి ఉంది. ఈ చొప్పున రెండు ఎకరాల వెంచర్‌లో మొత్తం 968 గజాలు అప్పగించాల్సి ఉంటుంది. సుమారు ఇక్కడ గజం ధర తక్కువలో తక్కువగా రూ.10 వేలు పలుకుతోంది. ఈ ప్రకారంగా రూ.10 లక్షల వరకు ఆదాయం పంచాయతీ కోల్పోనుంది.

అమ్మకం ఒకలా.. రిజిస్ట్రేషన్‌ మరోలా..

వెంచర్లు ఏర్పాటు చేసేవారు భూమి యాజమాని వద్ద నుంచి భూమిని కొనుగోలు చేయడం కొంత డబ్బు కట్టడం ఆ తరువాత రైతు పేరు మీదనే నాలా (వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా) మార్పు చేస్తారు. వెంటనే ఆ భూమిని ప్లాట్లుగా చేసి రోడ్లు వేసి, ప్లాట్ల హద్దురాళ్లు పాతి అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ప్లాట్లను గజాల లెక్కన అమ్ముతున్న వెంచర్‌ నిర్వాహకులు రిజిస్టేషన్‌ మాత్రం గుంటల్లో చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే లక్షల రూపాయల ఆదాయంతో పాటు ప్రజావసరాలు కేటాయించాల్సిన పది శాతం భూమి దక్కకుండా పోతోంది. ఈ విషయంపై ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అనుమతి లేకుండా ఉన్న వెంచర్లపై తక్షణమే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను ఆపాలని గ్రామస్తులు పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ చిలుకూరు మండల కేంద్రం శివారులో

అక్రమ వెంచర్‌దారుల నిర్వాకం

ఫ అనుమతి లేకుండానే ప్లాట్ల విక్రయాలు

ఫ ప్రభుత్వ నిబంధనలకు పాతర

ఫ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న

గ్రామ పంచాయతీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement