వానాకాలానికి ‘భరోసా’ | - | Sakshi
Sakshi News home page

వానాకాలానికి ‘భరోసా’

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

కొత్తవారికీ అవకాశం..!

జిల్లాలో ఈనెల 15వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవడం, లేదంటే పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులు ఎంఈఓల వద్ద దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వగా.. జిల్లాలో ఇప్పటి వరకు 3వేల మంది కొత్త రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో వ్యవసాయ అధికారులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జూలై 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశముంది.

నేడు విడుదల కానున్న పెట్టుబడి సాయం

కొత్తగా భూ పట్టా చేసుకున్న వారికీ

రైతు భరోసా పథకం వర్తింపు

బ్యాంకు ఖాతాల్లో డబ్బుల జమ తీరుపై

రైతుల్లో అయోమయం

నల్లగొండ (భానుపురి) : వానాకాలం పంటల సాగు ముమ్మరమైంది. జిల్లా రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పంటల సాగుకు కావాల్సిన పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది. ఏటా రెండు విడతల్లో ఇచ్చే ఈ సాయాన్ని వానాకాలం సీజన్‌కు మంగళవారం రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఎకరానికి రూ.6వేల చొప్పున ఇవ్వనుండగా.. ప్రభుత్వం ఏవిధంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందో స్పష్టత లేదు. రెండేళ్లుగా ఒక్కో సీజన్‌లో ఒక్కో విధంగా రైతులకు ఈ రైతు భరోసా నిధులను ఇస్తూ వస్తోంది. ఈ సీజన్‌లో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకూ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 3.03 లక్షల మందికి రైతుభరోసా నిధులు అందనున్నాయి.

సరిగ్గా సాగు సమయంలో..

రైతుబంధు పథకం ప్రారంభమైన సమయంలో సరిగ్గా రైతులకు పెట్టుబడికి అవసరమైనప్పుడూ ఈ డబ్బులు అందాయి. రానురాను నిధుల కొరత కారణంగా ఏటేటా ఆలస్యం అవుతూ.. కొన్నిసార్లు సీజన్‌ చివరి దశలో రైతులకు రైతుబంధు ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతుభరోసా కింద ఎకరానికి ఇచ్చే రూ.5వేలను రూ.6వేలకు పెంచగా.. నిధులను మాత్రం సరైన సమయంలో అందించలేదు. ఈ వానాకాలం సీజన్‌లో మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై చివరి తేదీ నాటికే నిధులను జమ చేయనున్నారు. 15 రోజుల్లోనే చివరి రైతు వరకు ఈ నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

అందని మార్గదర్శకాలు..

జిల్లావ్యాప్తంగా 6 లక్షల ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి 3.03 లక్షల మందికి పట్టాలు జారీ అయి ఉండగా రైతుభరోసా కింద దాదాపు రూ.300 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి. ఈ సీజన్‌లో ఏవిధంగా రైతుల అకౌంట్లలో జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రైతులు ప్రభుత్వం విడుదల చేసే రైతుభరోసా నిధులు తమకు వస్తాయో.. రావోనని అయోమయంలో ఉన్నారు. పదెకరాల వరకే రైతుభరోసా ఇస్తారని, సాగు భూములకేనని.. ఇలా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. నిధుల జమపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో అధికారుల్లో సందిగ్ధత నెలకొంది.

సాగు భూమి 6లక్షల ఎకరాలు

రైతులు 3.03 లక్షలు

అవసరమున్న నిధులు రూ.300 కోట్లు

కొత్తగా నమోదైన రైతులు 3,000

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement