నల్లగొండ (భానుపురి) : ప్రజావాణి పెండింగ్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 98 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రజావాణిలో కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. వానాకాలం వన మహోత్సవానికి శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ప్రతి కాలేజీ, స్కూళ్లలో డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై సంక్షేమ హాస్టల్స్‌లో, కాలేజీ, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజు, డీఆర్‌డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, సీపీఓ కిషన్ నాయక్, డీఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ను వేగవంతంగా పూర్తి చేయాలి
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)ను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఈ ఆర్వోలు)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు ఇంటింటికీవెళ్లి ఫారాలు అందజేస్తున్నానిరి మిగతా ప్రక్రియను త్వరలో పూర్తిచేస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజు, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ ఆర్డీఓలు వేణు మాధవరావు, శ్రీనివాసులు, సూర్యనారాయణ, సూర్యాపేట తహసీల్దార్ కృష్ణయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, సెక్షన్ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజావాణిలో కలెక్టర్
తేజస్ నంద్‌లాల్ పవార్


