భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10.30 గంటలకు నాగారం మండలంలోని ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారులు తెలిపారు.
సూర్యక్షేత్రంలో
విశేష పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్‌స్వామి, గణపురం నరేష్, గిరి, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు.
వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
నూతనకల్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి(వీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ కోరారు. ఆదివారం నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ.6వేలకు పెంచడంతో పాటు వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చి విస్మరించారన్నారు. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో వందశాతం రాయితీ కల్పించడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి వికలాంగుల బ్లాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. త్వరలోనే వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్‌ను ముట్టడించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆ సమితి మండల అధ్యక్షులు బాణాల వీరారెడ్డి, కొల్లూరి ఈదయ్య, కొణతం కృష్ణారెడ్డి, నగేష్, ఇమ్మారెడ్డి నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
440 అడుగులకు
మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం 440.90 (పూర్తిస్థాయి నీటిమట్టం 445) అడుగులకు చేరకుంది. వారం రోజులుగా హైదరాబాద్‌తో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతోంది. ఆదివారం ఎగువ నుంచి మూసీకి 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.40 టీఎంసీల నీరు ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో మరో నాలుగు అడుగుల నీరు చేరితే పూర్తిస్థాయిలో నిండనుంది.


