ఓటర్ల వివరాలలో తప్పులు
ఆన్‌లైన్ ఎన్యుమరేషన్ ఇలా..
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు, ప్రజలే స్వయంగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు గానూ ప్రత్యేక వెబ్‌లింక్‌ను అందుబాటులో ఉంచింది. కుటుంబం సభ్యుల తరఫున ఒకరు వివరాలను నమోదు చేసి, అవసరమైన ఫారాలను సమర్పించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. దాంతో వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా వివిధ కారణాలతో ఇంటి వద్ద అందుబాటులో లేని వారికి ఊరట కలుగ నుంది.
25 నుంచి ప్రారంభం
వలసల కారణంగా కొందరికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉండటం, మరణించిన వారి పేర్లను తొలగించకపోవడం వంటి వాటిని సరి చేసేందుకు ఎన్నికల సంఘం శ్రీసర్‌శ్రీకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 నుంచి ‘సర్’ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని అధికారు సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోవడం, మార్పులు–చేర్పులు చేయడం వంటివి కూడా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
జిల్లాలో 10.01 లక్షల ఓటర్లు
సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 2002 ఓటర్ల జాబితాలోని వివరాలతో పోల్చితే జిల్లాలో ఓటర్ల సంఖ్య తారుమారు అయినట్లు తెలుస్తుంది. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉండటం, 2016లో జిల్లాల విభజన కారణంగా ఓటర్ల వివరాల నమోదులో తేడాలు ఉన్నాయి. సూర్యాపేటతో పాటు యాదాద్రి జిల్లాలోని కొన్ని మండలాలు కలిసి ఒకే నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయి.
అధికారులు చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియ సమయంలో ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లుగా గుర్తించారు. వాటిల్లో ఇంటి పేరు, ఓటరు పేరు, తండ్రి పేరు లాంటి వాటిల్లో తప్పులు దొర్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 2 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించారు. సర్‌లో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తప్పులను సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆన్‌లైన్‌లోనూ ఎన్యుమరేషన్ నమోదుకు అవకాశం
ఫ వెబ్ లింక్‌ను అందుబాటులో
ఉంచిన ఎన్నికల సంఘం
ఫ కుటుంబంలో
ఒకరు ఫారాలు నింపినా ఓకే
ఫ వివరాలు సరిచూసి
ఓట్లు ఖరారు చేయనున్న బీఎల్‌ఓలు
ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ (ఓటర్ల నమోదు/ వివరాల సేకరణ) చేసుకునే అవకాశం కల్పించింది. బీఎల్‌ఓలు ఇంటికి రాకముందే ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారం పూరించాలి. ఆ వివరాలను బీఎల్‌ఏలు సరిపోల్చుకొని ఓట్లను ఖరారు చేస్తారు. కుటుంబంలోని ఎవరైనా అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్లు తమ మొబైల్ నంబర్ లేదా ఓటరు కార్డు నంబర్‌ను ఉపయోగించి, ఫోనుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ‘ఈ–సైన్’ చేసి, వివరాలను నమోదు చేయవచ్చు. ఎన్యుమరేషన్ సమయంలో ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లు ఈ విధానం ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.


