కోదాడరూరల్ : ఏఐ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. పట్టణంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ ఆపరేటింగ్, చాట్ జీపీటీ, ఏఐ స్కిల్స్ అప్లికేషన్, డిజైన్ థింకింగ్, మేకింగ్ ఆఫ్ కోడింగ్, పెయింటిగ్ వంటి విషయాలను నేర్చుకోవడం వల్ల సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించవచ్చన్నారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ సంతోష్‌కిరణ్, ఎంఈఓ సలీంషరీఫ్, హెచ్‌ఎం మార్కేండేయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిగా ఎస్పీ
సూర్యాపేటటౌన్ : ఎస్పీ నరసింహ బడిపంతులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. 8వ తరగతి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. వారికి సాంఘిక శాస్త్రం పాఠాలను బోధించారు. ‘ఉత్తర ధృవం – దక్షిణ ధృవం’ అంశాన్ని విద్యార్థులకు వివరించారు. ఆయన బోధనతో విద్యార్థులను ఆకట్టుకోగా, ఉపాధ్యాయులు సైతం ఆసక్తిగా తిలకించారు. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే కుమారుడిని చదివిస్తున్న జూనియర్ అసిస్టెంట్ హరితను ఎస్పీ సన్మానించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్‌ఐలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఎరువుల షాపు సీజ్
మద్దిరాల : యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపును జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి సీజ్ చేశారు. మద్దిరాలలోని స్వర్ణ ఫెర్టిలైజర్ షాపు యజమాని యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఆదేశానుసారం షాప్‌ను సీజ్ చేసి, లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఏడీఏ రమేష్‌బాబు, ఏఓ అనిషారూహి, సిబ్బంది ఉన్నారు.
నీట్ కేంద్రాల వద్ద
పటిష్ట భద్రత
సూర్యాపేటటౌన్ : పట్టణంలో ఆదివారం జరిగే రీ–నీట్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 (163 బీఎన్‌ఎస్‌ఎస్–2023) అమల్లో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో గుంపులుగా చేర రాదన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, మైకులు, డీజేలతో ఊరేగింపులపై నిషేధం ఉంటుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, కళాశాల ప్రిన్సి పాల్ పెరుమాళ్ల యాదయ్య, సిబ్బంది ఉన్నారు.


