టీచర్‌ పిల్లలకు ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

టీచర్‌ పిల్లలకు ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు

Jun 18 2026 1:59 AM | Updated on Jun 18 2026 1:59 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : సూర్యాపేట మండలం మందలవాడలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న దండుగుల శ్రీలత తమ ఇద్దరు పిల్లలను బుధవారం తమ సొంత ఊరైన తిరుమలగిరి పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రైవేట్‌లో చదువుతున్న తమ కుమార్తె దీక్ష శ్రీకి 3వ తరగతిలో, కుమారుడు శ్రీయాన్‌ 2వ తరగతిలో అడ్మిషన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచేందుకు తమ పిల్లలను చేర్పించానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, సత్యనారాయణరెడ్డి, వెంకటరామనర్సయ్య, సౌమ్యాబాయి, రవీందర్‌, గిరి పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్య కల్యాణం జరిపారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

డీఈఈ–సెట్‌ ఫేజ్‌2

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

నల్లగొండ : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) కోర్సుల్లో 2026–28 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు డీఈఈ–సెట్‌–2026 ఫేజ్‌–2 సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌, వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదలైనట్లు ప్రభు త్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈ–సెట్‌లో అర్హత సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో గతంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోని వారికి జూన్‌ 18న డైట్‌, నల్లగొండలో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫేజ్‌–1లో సీటు పొంది కళాశాలలో చేరిన అభ్యర్థులకు స్లైడింగ్‌ ఆప్షన్‌, ఫేజ్‌–1లో సీటు పొందని వారు, గతంలో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు జూన్‌ 19, 20 తేదీల్లో కొత్తగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్‌ 21న వెబ్‌ ఆప్షన్ల సవరణ (ఎడిట్‌)కు అవకాశం కల్పించారని తెలిపారు. మెరిట్‌, రోస్టర్‌ పద్ధతిన జూన్‌ 25న సీట్లు కేటాయిస్తారని వెల్లడించారు. అభ్యర్థులు జూన్‌ 25 నుంచి 27 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూలై 1 నుంచి క్లాస్‌లు ప్రారంభమవుతాయని తెలిపారు.

రాజీ కోసం బారులు

హుజూర్‌నగర్‌ : ఈనెల 20న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా తమ కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులు బుధవారం హుజూర్‌నగర్‌ పట్టణంలో కోర్టుకు పోటెత్తారు. వివిధ మండలాల నుంచి కక్షిదారులు కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఎక్కువ మంది ఒకేసారి రావడంతో క్యూలో నిలబెట్టి కోర్టు లోపలికి పిలిచారు. అనంతరం న్యాయమూర్తులు కక్షిదారులతో చర్చించారు. జాతీయ లోక్‌ అదా లత్‌ రోజు తుది తీర్పు ఇచ్చి రాజీ పత్రాలు అందజేయనున్నట్టు కోర్టు సిబ్బంది తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement