భానుపురి (సూర్యాపేట) : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హులు, నకిలీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పకడ్బందీగా నిర్వహిస్తోందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బీఎల్‌ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 25 నుంచి నెల రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2002 నాటికి ఓటరుగా నమోదై, ప్రస్తుతం ఉన్న వారి వివరాలను ధృవీకరిస్తారని, ఒకవేళ 2002 నాటికి ఓటరు జాబితాలో పేరు లేకపోతే, వారిని తల్లి లేదా తండ్రి వివరాలతో మ్యాపింగ్ చేస్తారని స్పష్టం చేశారు. ఓటరు పేరు, తండ్రి పేరు లేదా ఇతర వివరాలు తప్పుగా నమోదై ఉంటే సరిచేస్తారన్నారు. చనిపోయిన వారి పేర్లను శాశ్వతంగా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే, వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తారన్నారు. తుది డ్రాఫ్ట్ జాబితాలో పేరు నమోదైన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తామని, ఇందులో ఏవైనా లోపాలు కనిపిస్తే సంబంధిత ఆర్డీఓలు నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తమ అడ్రస్ మార్చుకోవడానికి ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఆర్డీఓలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ వి.రమేష్ తహసీల్దార్లు, సూపర్వైజర్లు, టెక్నికల్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


