సూర్యాపేటటౌన్ : వానాకాలం సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులకు కారణమవుతుందని అన్నారు. మంగళవారం ఆయన సాక్షి ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ‘డ్రై డే’గా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో నీరు నిల్వ ఉండే పాత్రలు, కూలర్లు, పూలకుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు వంటి వాటిని పరిశీలించి నీరు నిల్వ ఉండకుండా చూస్తారు. దోమల ఉత్పత్తిని అరికట్టడంలో డ్రై డే కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామాల్లో మురుగు నీరు నిలిచిన చోట డ్రై డే రోజు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు దోమల నివారణకు మందు చల్లుతారు.
జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలి. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పీహెచ్‌సీలో రక్త నమూనాలను తీసుకుని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో గల టీ హబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత రిపోర్టు మరుసటి రోజు రోగి ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రాలకు పంపించి పరీక్షలు నిర్వహిస్తారు. చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటారు.
గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది జ్వరాల బారిన పడినా, అనారోగ్యానికి గురైనా వెంటనే అక్కడికి వెళ్లేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం. జిల్లా స్థాయిలో పది మంది డాక్టర్‌లతో ఒక టీం ఉంటుంది. అలాగే సూర్యాపేట, కోదాడ డివిజన్ స్థాయిలో పది మంది వైద్యులతో మరొక టీం, మండల స్థాయిలో మెడికల్ ఆఫీసర్‌తోపాటు వైద్య సిబ్బంది మొత్తం నలుగురితో ఒక టీంను ఏర్పాటు చేశాం. వీరు ఎక్కువ మంది రోగాల బారిన పడిన వారి వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సేవలందిస్తారు.
సూర్యాపేట జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఒకటి జనరల్ ఆస్పత్రి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సమీప ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించాలి.
సీజనల్ వ్యాధులను నివారించడం ప్రజల చేతుల్లోనే ఉంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ కాకుండా చూడడం, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. సీజనల్ వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నియంత్రణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రతిఒక్కరూ ఆరోగ్య శాఖ సూచనలు పాటించాలని కోరాం. జిల్లాలో దోమల నియంత్రణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు లేకుండా ప్రజలు కూడా సహకరించాలి.
ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను
ఏర్పాటు చేశాం
ఫ ప్రతి పీహెచ్‌సీలో
రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ


