రైతుల్లో సందేహాలు
భానుపురి (సూర్యాపేట) : రైతు భరోసా పథకం అమలుపై జిల్లా రైతాంగంలో గందరగోళం నెలకొంది. అసలు రైతు భరోసా ఉన్నట్టా.. లేనట్లా అనే సందేహాలు రైతాంగంలో వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడి సాయం గత యాసంగి సీజన్‌లో రెండు విడతల్లో కేవలం రెండెకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అందించింది. మిగతా నిధులను జమ చేయకపోగా.. ఈలోపు 2026–27 వానాకాలం వ్యవసాయ సీజన్ రానే వచ్చింది. రైతులు విత్తనాలను కొనుగోలు చేయడం, దుక్కులు దున్నుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అయినా ఇంతవరకూ గత యాసంగి సీజన్ రైతు భరోసా కానీ.. ప్రస్తుత సీజన్ నిధులపై గానీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
ఎకరానికి రూ.12 వేలు
రాష్ట్రవ్యాప్తంగా చాలావరకు చిన్నసన్నకారు రైతులే ఉన్నారు. వీరంతా పంటల సాగు కోసం బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అప్పులు తీసుకొస్తుంటారు. పంటల అమ్మకం సమయంలో తెచ్చిన ఈ అప్పులు తీర్చేందుకు సరిపోతుంది. దీనిని గమనించిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంగా సంవత్సరానికి రూ.10వేలను రైతులకు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రూ.15వేలుగా హామీ ఇచ్చి.. ప్రస్తుతం సంవత్సరానికి రూ.12వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో.. యాసంగి సీజన్ ప్రారంభంలోనూ రూ.6 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది.
రెండేళ్లుగా ఆలస్యంగానే..!
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 2,89,371 మంది రైతులు ఉన్నారు. వీరు దాదాపు 6 లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. గుంట భూమి నుంచి పది ఎకరాలకు పైబడి భూమిని కలిగిన రైతులు ఉన్నారు. వీరికి పంటల సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు రెండేళ్లుగా ఆలస్యంగా జమ చేస్తున్నారు. ప్రభుత్వం కొన్నిసార్లు పంటల సాగు పూర్తయిన తర్వాత నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ప్రధానంగా నిధుల సమీకరణలో వస్తున్న ఇబ్బందులతో ఇలా జరుగుతోంది. ఈ పథకం ప్రారంభమైన 2018 నుంచి ఒకే విడతలో రైతులందరికీ పెట్టుబడిసాయం అందించారు. రానురాను నిధుల సమస్య కారణంగా విడతల వారీగా ఇస్తుండగా.. మొదటగా ఎకరం, రెండెకరాల భూమికి ఇస్తూ వస్తున్నారు.
ఫ గత యాసంగి సీజన్‌లో
రెండెకరాల వరకే జమ
ఫ ప్రస్తుతం వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం
ఫ పెట్టుబడి సాయానికి
ఎదురుచూస్తున్న రైతులు
ఫ స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
2025–26 యాసంగి సీజన్‌లో గతానికి భిన్నంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేసింది. భూమి ఉన్న రైతులందరికీ మూడు విడతల్లో రైతుభరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు జిల్లాలో భూమి ఉన్న 2,87,371 మంది రైతులకు గాను.. 2.61 లక్షల మందికి మొదటి విడతగా గుంట భూమి నుంచి ఎకరం భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. మరో 25 రోజులకు రెండెకరాల వరకు.. అంటే దాదాపు 2 లక్షల మంది రైతులకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మూడో విడత విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేకుండా పోయింది. ఈ నిధులను ప్రభుత్వం ఇస్తుందా.. లేదా.. అనే విషయంలో రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వానాకాలం సీజన్ మొదలుకావడంతో రైతులు వరి, పత్తి విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. వీరికి ఈ సీజన్ రైతుభరోసా నిధులపై స్పష్టత లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తేవాల్సిన పరిస్థితి నెలకొంది.


