భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పరిష్కరించడానికి జిల్లా అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం మొదలైనందున డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ధాన్యం కొనుగోలులో ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 113 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సీపీఓ కిషన్ నాయక్, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఈఓ అశోక్, సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు పాల్గొన్నారు.
ఆహార నాణ్యతపై తనిఖీలు చేపట్టాలి
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా నిరంతరం తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన ఆహార భద్రతపై జిల్లాస్థాయి సలహా కమిటీ (డీఎల్‌ఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు నిత్యావసరాలు, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు, నూనెలు, మాంసం, గుడ్లు, స్వీట్లు అందేలా విక్రయదారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 65వ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, దాబాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి ఆహార నాణ్యతను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, అంగన్‌వాడీల్లో చిన్న పిల్లలకు భోజనం, ఇతర ఆహార పదార్థాలు అందించే కార్యకర్తలకు దశలవారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌ఓ మోహన్‌బాబు, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీటీడీఓ శంకర్, ఎస్సీ డీడీ దయానందరాణి తదితరులు పాల్గొన్నారు.


