భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సాగుకు అనుకూలమైన రోహిణి కార్తె మొదలైంది. ఈ కార్తెలో సాగయ్యే పంటలు మంచి దిగుబడి ఇస్తాయన్నది రైతుల నమ్మకం. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతుండగా వ్యవసాయశాఖ మాత్రం ఇంతవరకు ఈ సీజన్‌కు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయలేదు. వానా కాలం సీజన్‌లో జిల్లాలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉంది, ఏ రకమైన విత్తనాలు ఎంత అవసరం, యూరియా ఎంత కావాల్సి ఉంది అనే విషయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాంచాల్సి ఉంటుంది. ఈ మేరకు రైతులకు అందుబాటులో ఉంచాల్సి ఉంది.
15 రోజులకే కీలకం..!
జిల్లాలో వానాకాలం సీజన్ రోహిణి కార్తెతోనే ప్రారంభమవుతోంది. ముందస్తుగా సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోయగా.. ఆరుద్ర కార్తెలో ముమ్మరం కానున్నాయి. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధం అవుతున్నారు. బోరుబావుల కింద వరి సాగు చేసే రైతులు ఈ కార్తెలోనే వరి నాట్ల కోసం మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కార్తె 15 రోజుల పాటు ఉండనుండగా.. కొద్దిమంది రైతులు ఇప్పటికే నారుమళ్లను సిద్ధం చేసి నీళ్లు వేయగా మరి కొందరు గురు, ఆదివారం (మంచి రోజుగా భావించి నారు మళ్లకు నీళ్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం, పదిరోజుల్లో నార్లు పోస్తారు. వరితో పాటు పత్తి సాగు చేసే రైతులు భూమి దున్నడంతో పాటు పెంటమట్టి తోలకం, చెత్తాచెదారం తొలగించి చేనును సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
యాక్షన్ ప్లానెక్కడ..!
రోహిణికార్తెలోనే వరి సాగు చేయాలనుకున్న రైతులు విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొద్దిమంది రైతులు డీఏపీ బస్తాలను సైతం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయినా ఇప్పటి వరకు జిల్లాలో వానాకాలం – 2026 పంటల యాక్షన్ ప్లాన్ సిద్ధం కాలేదు. రైతులు ఏ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు..? ఏ విత్తనాలు కోరుకుంటున్నారు..? వారికి కావాల్సిన వైరెటీలు ఏమిటి..? అవి ఎంతమేర జిల్లాలో అవసరం. ఇంకా ఎన్ని విత్తనాలు కావాల్సి ఉందన్న అంచనాలతో రూపొందించే యాక్షన్ ప్లానే ఈ సీజన్ సాగులో కీలకం. ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అధికారులు సమకూర్చుతారు. ఇంత వరకు వానాకాలం యాక్షన్ ప్లాన్ సిద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సీజన్‌లో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. రాత్రిళ్లు జాగారం చేసి మరీ కొనుగోలు చేశారు. ప్రస్తుత సీజన్‌లో ముందస్తు ఏర్పాట్లు లేకపోతే మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం వెంటనే వానా కాలం సీజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి. ఈ మేరకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
వానాకాలం సాగుకు
సన్నద్ధమవుతున్న రైతులు
ఇంతవరకు ఖరారుకాని
వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్
ఎరువులు, విత్తనాలు అందుబాటులో
ఉంచాలని రైతుల వినతి


