యూనిఫాం రాకపాయే.. | - | Sakshi
Sakshi News home page

యూనిఫాం రాకపాయే..

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

బడి తెరిచే వేళాయే..

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది బడి తెరిచే నాటికి పుస్తకాలతో పాటు యూనిఫాం అందించేవారు. కానీ ఇప్పటి వరకు డ్రెస్‌ కుట్టేందుకు అవసరమైన క్లాత్‌ జిల్లాకు అందలేదు. మరో 18 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా యూనిఫాం కుట్టించి అందించడం సాధ్యం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సారి నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులు మామూలు దుస్తుల్లోనే పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభం రోజు పుస్తకాలు మాత్రమే ఇవ్వనుండగా.. యూనిఫాం ఆలస్యం కానుంది.

జిల్లాలో 65 వేల మంది విద్యార్థులు

జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 190 ఉన్నత, 80 ప్రాథమికోన్నత, 680 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 65వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతి ఏడాది పాఠ్య పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజే ఒక జత, తరువాత మరోజత ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాకు వస్త్రం రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఒక్కో విద్యార్థికి రెండు జతలు

ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌ అందిస్తోంది. ఇది పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనంగా ఉంటున్నది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో పిల్లలకు కొత్త దుస్తులు వస్తాయనే ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కానీ క్లాత్‌ రాక ఆలస్యం కావడంతో ఈ సారి యూనిఫాం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

పాఠశాలల వద్ద అస్పష్టత...

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇప్పటివరకు యూనిఫామ్‌ క్లాత్‌ పంపిణీపై అధికారిక సమాచారం అందలేదు. ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొంది. క్లాత్‌ వచ్చిన తర్వాత టైలర్లకు ఇచ్చి యూనిఫామ్‌లు సిద్ధం చేయించాల్సి ఉంటుంది. పాఠశాలల పునఃప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో క్లాత్‌ సరఫరాను వేగవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

క్లాత్‌ త్వరలోనే వస్తుంది : అశోక్‌, డీఈఓ

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది అందించే యూనిఫాం క్లాత్‌ త్వరలోనే వస్తుంది. రాగానే వెంటనే పాఠశాలల వారీగా మహిళా సంఘాలకు క్లాత్‌ను అందించి దుస్తులు కుట్టిస్తాం. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు వచ్చాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజే అందజేసేందుకు కృషి చేస్తాం.

ఇప్పటి వరకు అందని యూనిఫాం క్లాత్‌

ఫ మరో 18 రోజుల్లో పాఠశాలలు

పునఃప్రారంభం

ఫ అప్పటివరకు దుస్తులు అందడం కష్టమే

Advertisement
 
Advertisement
Advertisement