చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట ప్రిన్సి పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.హేమలత నాయుడు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న సుప్రియ సుమన్ జైశ్వాల్ సూర్యాపేటకు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రాసిక్యుషన్ డైరెక్టర్ సాంబ శివారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీపై వెళ్తున్న ఏపీపీని ఆదివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ దాసరి మధుసూదన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామికి
నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలో మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, నాగభూషణం, భక్తులు పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం మహా సౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, గిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే భక్తులు పాల్గొన్నారు.


