భానుపురి (సూర్యాపేట) : బీఆర్‌ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్యతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని, విచారణను ప్రభావితం చేసేందుకే మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హత్య రాజకీయాలపై జగదీష్‌రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. మధు హత్య పాత కక్షలతో జరిగిందా.. వ్యక్తిగత కక్షలతోనా అనేది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. ప్రస్తుతం సూర్యాపేట మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి సారథ్యంలో ప్రశాంతంగా ఉందన్నారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ప్రోత్సహించలేదన్నారు. ఆ హత్యతో మా పార్టీకి సంబంధం లేదని, త్వరలోనే నిజాలు తేలుతాయని స్పష్టం చేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ, నాయకులపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్‌అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, జిల్లా కోశాధికారి కక్కిరేని శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, కౌన్సిలర్ నాగుల వాసు, దండు మైసమ్మ ఆలయ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య


