సూర్యాపేటటౌన్ : ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉండడంతో పిల్లలు, యువకులు వేడి నుంచి ఉపశమనం కోసం బావులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లే సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత సరదా విషాదం కాకూడదని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు తల్లిదండ్రులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చెరువులు, కాల్వల వద్దకు వెళ్లకుండా చూడాలని పేర్కొన్నారు.
ప్రజల వద్దకే పోలీసు సేవలు
ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో జిల్లాలో ఆన్‌సైట్ –ఎఫ్‌ఐఆర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు దారులు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేకుండా, సంఘటన జరిగిన ప్రదేశానికే వెళ్లి ఫిర్యాదులను స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా, నమ్మకమైన పోలీసు సేవలు అందించేందుకు ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళపై లైంగిక దాడులు, చిన్న పిల్ల లపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, చోరీలు, గొడవలు, మిస్సింగ్ కేసులు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్, వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఈ విధానం ఎంతో మేలని పేర్కొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


