డీఆర్వోగా ప్రేమ్‌రాజ్‌ | - | Sakshi
Sakshi News home page

డీఆర్వోగా ప్రేమ్‌రాజ్‌

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా రెవెన్యూ అధికారిగా డి.ప్రేమ్‌రాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ప్రొటోకాల్‌ విభాగంలో అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌రాజ్‌ను సూర్యాపేట డీఆర్వోగా నియమించారు. ఇప్పటి వరకు డీఆర్వో పోస్టు ఖాళీగా ఉంది.

4న కోదాడ పెద్దచెరువు సంఘం ఎన్నికలు

కోదాడ : కోదాడ పెద్దచెరువు మత్య్స సహకార సంఘానికి జూన్‌ 4న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సహకార అధికారి వి. ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ బాలుర పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 9 కార్యవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నవారు ఈ నెల 25, 26, 28 తేదీలలో కోదాడ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద నామినేషన్‌లు దాఖలు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.

లక్ష్మీనరసింహుడికి నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ జ్యోతి, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో

తీవ్ర జాప్యం

నూతనకల్‌ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా నేటికీ కాంటాలు వేయడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంబాల శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం ముంచుకొస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 30 శాతం ధాన్యం రాసులు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి లారీల కొరత సమస్యను పరిష్కరించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. వారి వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బూర వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్‌గౌడ్‌, రైతు సంఘం నాయకులు యానాల వెంకట్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement