నేడు వేద పాఠశాలకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

నేడు వేద పాఠశాలకు శంకుస్థాపన

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

యాదగిరిగుట్ట: సీఎం రేవంత్‌రెడ్డి శనివారం యాదగిరిగుట్టకు రానున్నారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని టెంపుల్‌ సిటీపై రూ.43 కోట్లతో, 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాలతో పాటు, విశాలమైన పార్కింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే పనులకు సీఎం రేవంత్‌రెడ్డి, కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీతో కలిసి శంకుస్థాపన పూజలు చేయనున్నారు. శనివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ శుక్రవారం పరిశీలించారు. వేద పాఠశాలకు శంకుస్థాపన చేసే స్థలాన్ని, కొండకు దిగువన వాహన పూజల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపైన, ప్రెసిడెన్షియల్‌ సూట్‌, వేద పాఠశాల స్థలం, ఘాట్‌ రోడ్డు ప్రాంతాల్లో బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి.

ముస్తాబైన ఆలయం

యాదగిరీశుడిని దర్శించుకునేందుకు నాల్గవ సారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక స్వాగతం పలికేందుకు ఆలయాధికారులు సిద్ధమయ్యారు. సీఎంను ఆకర్షించే విధంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఇప్పటికే పలువురు అర్చకులు, అధికారులకు ఈఓ భవాని శంకర్‌ బాధ్యతలను అప్పగించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులకు ఆశీర్వచనం చేసిన అనంతరం అందజేసే ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement