సర్వీస్‌ రికార్డులో చేతివాటం | - | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ రికార్డులో చేతివాటం

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

విచారణకు ఆదేశించాం

సూర్యాపేటటౌన్‌ : రికార్డుల ప్రకారం తన సర్వీస్‌ పూర్తయినా.. అక్రమంగా సర్వీస్‌ రికార్డుల్లో తన పుట్టిన తేదీని దిద్దుకొని నాలుగేళ్లు అదనంగా ఉద్యోగంలో కొనసాగాడు ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు. పదవీ విరమణ వయస్సు దాటినా నాలుగేళ్లు విధుల్లో కొనసాగి జీతం రూపంలో ప్రభుత్వ సొమ్మును కాజేశాడు. ఈ విషయమై స్వయాన అతడి కుమారుడే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. అయినా అతడిపై చర్యలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సర్వీస్‌బుక్‌లో తేదీ మార్పు

మద్దిరాల మండలం చిన్ననెమిల గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు అల్లంనేని రంగారావు ఎస్‌జీటీగా విద్యాశాఖలో సేవలందించి 2004లో ఉద్యోగ విరమణ పొందారు. సదరు ఉపాధ్యాయుడి పుట్టిన తేదీ ఆయన చదివిన పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్‌ తొర్రూర్‌) రికార్డుల ప్రకారంగా 12 నవంబర్‌ 1942గా ఉంది. అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం ఆయన 58 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసుకొని 2000 సంవత్సరంలో రిటైర్డ్‌ కావాల్సి ఉంది. అయితే కంప్యూటర్‌ వ్యవస్థ లేని సమయంలో సదరు ఉపాధ్యాయుడు తన సర్వీస్‌ బుక్‌లో చేతిరాతతో ఉన్న పుట్టిన తేదీని 1942కు బదులు 1946గా దిద్ది నాలుగేళ్లు అదనంగా కొలువులో కొనసాగారు. అధికారుల కళ్లుగప్పి 2004 వరకు విధుల్లో కొనసాగారు. నాలుగేళ్లు జీతం రూపంలో ప్రభుత్వ సొమ్మును కాజేశారు.

తండ్రి అక్రమాలపై కుమారుడి ఫిర్యాదు

అల్లంనేని రంగారావు కుమారుడు వెంకటేశ్వర్‌రావు ఈ విషయం తెలుసుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన విషయమై కలెక్టర్‌, డీఈఓకు ఫిర్యాదు చేశారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ హైదరాబాద్‌, అకౌంట్‌ జనరల్‌ ఆఫీస్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. మండల విద్యాశాఖ అధికారులకు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెంకటేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు అల్లంనేని రంగారావు విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని నూతనకల్‌ మండల విద్యాధికారికి ఆదేశించాం. సర్వీస్‌ పుస్తకంలో పుట్టిన తేదీ దిద్దుకొని నాలుగేళ్లు అదనంగా జీతం పొందినట్లు రుజువైతే ఆ డబ్బులను రికవరీ చేస్తాం. అతడిపై చర్యలు సైతం ఉంటాయి. – అశోక్‌, డీఈఓ

ఫ పుట్టినతేదీ మార్చుకొని అదనంగా నాలుగేళ్లు సర్వీస్‌లో

ఫ ప్రభుత్వాన్ని మోసగించిన

రిటైర్డ్‌ టీచర్‌

ఫ తండ్రి అక్రమాలపై

కుమారుడి ఫిర్యాదు

Advertisement
 
Advertisement
Advertisement