ఫ నెలాఖరు నాటికి ఉద్యోగుల బదిలీలు
ఫ పలు శాఖల్లో జోరుగా పైరవీలు
ఫ నచ్చిన చోటుకు మారేందుకు తిప్పలు
ఫ గాడ్ ఫాదర్ల వద్దకు పరుగులు
భానుపురి (సూర్యాపేట) : పలు ప్రభుత్వ శాఖల్లో నెలాఖరు నాటికి ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొన్ని శాఖలకు మినహాయింపులు ఇవ్వగా.. బదిలీలు జరిగే శాఖల్లో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా స్థానచలనం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పైరవీల జోరు పెంచారు. తమకు అనుకూలంగా ఉన్న చోటుకు మారేందుకు, స్థానచలనం కాకుండా ఉండేందుకు ఓవైపు జిల్లాస్థాయి అధికారులను, మరోవైపు ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు.
బదిలీల సందడి..!
ఉపాధ్యాయులు, పోలీసులు, వాణిజ్య పన్నులు, అబ్కారీ, రవాణా, అటవీ శాఖల ఉద్యోగులు మినహా మిగతా 45 శాఖలకు పైగా ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరిగా మారాయి. ఇందులోనూ నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పరిసరిగా బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఆయా శాఖల జిల్లా అధికారులు తమ శాఖల పరిధిలో ఉన్న ఉద్యోగుల బదిలీలను చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించడం, బదిలీ అయ్యే ఉద్యోగుల లిస్టులను ప్రదర్శించడం వంటివి చేపట్టారు. ఆయా ఖాళీల ఆధారంగా 5 ఆప్షన్లతో కూడిన దరఖాస్తులను బదిలీ అయ్యే ఉద్యోగుల నుంచి స్వీకరించారు. కొన్నిశాఖల్లో ఒకట్రెండు రోజుల్లోనే కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖల్లో బదిలీ సందడి నెలకొంది.
నచ్చిన కాడికి వెళ్లేందుకు..!
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 7,987 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 2024లో చేపట్టిన బదిలీల్లో పలువురికి స్థానచలనం కాగా.. ప్రభుత్వ మినహాయింపులు, బదిలీలు అయ్యే శాఖల్లో దాదాపు 3వేలకు పైగా ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగుల బదిలీలు అధికంగా జరగనున్నాయి. బదిలీ తప్పనిసరి అనుకున్న వారంతా తమకు అనుకూలమైన మండలాలు, ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. జిల్లాస్ధాయి అధికారులనే కాకుండా ప్రజాప్రతినిధులతో ఒత్తిడి తెస్తున్నారు. దాంతో పాటు ఉద్యోగ సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న వారితో తమ పైరవీలను నడుపుతున్నారు. ఏది చేసైనా తమకు కావాల్సిన ప్రాంతాలు, పోస్టింగ్‌లను పొందేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నెల 25 నుంచి ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది.


