భానుపురి (సూర్యాపేట) : ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యం కావాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మదిరంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన విచారణతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీ తక్షణమే తమ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. జూన్ 15 నుంచి 24 వరకు బూత్ స్థాయి అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ, ప్రిపరేషన్, జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేస్తారన్నారు. జూలై 24న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మార్పు, జూలై 31న ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల పరిష్కారం, అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా అధికారిక ప్రచురణ ఉంటుందని వివరించారు.
బీఎల్‌ఓల పాత్ర అత్యంత కీలకం
కొత్త ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించడం, వలస వెళ్లిన వారిని గుర్తించడంతో పాటు అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే బాధ్యత కూడా బీఎల్‌ఓలపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, రాజకీయ నాయకులు చకిలం రాజేశ్వర రావు, ఎండీ అబీద్, రవి, కరుణాకర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


