ఆ ఇద్దరూ కావాలంటున్నారు..
కోదాడ : కోదాడ మున్సిపల్ కోఆప్షన్ పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ పదవులను భర్తీచేయడంలో కీలకంగా వ్యవహరించే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాత్రం వీటిపై ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. మున్సిపాలిటీ పాలక వర్గం అధికారం చేపట్టిన రెండు నెలలలోపు వీటిని నింపాల్సి ఉంది. అయినా మూడు నెలల దాటినా కోఆప్షన్ పదవుల భర్తీకి మాత్రం మోక్షం కలగడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల కన్నా కోదాడలోనే అత్యధికంగా 57 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ముస్లిం మైనార్టీ కోటాలో ఉన్న ఒక్క పదవికి 17 మంది, క్రిస్టియన్ మైనార్టీ కోటాలో ఉన్న ఒక్క కోఆప్షన పదవికి మరో 17 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే, మాజీ ప్రజాప్రతినిధులు, పరిపాలన అనుభవం ఉన్న వారి కోటాలోని రెండు స్థానాలకు 25 మంది దరఖాస్తు చేశారు.
ఆశావహులు ఎక్కువగా ఉండడంతో..
కోఆప్షన్ పదవులు పరిమితంగా.. ఆశావహులు భారీ సంఖ్యలో ఉండడంతో పదవులకు నాయకులను ఎంపిక చేయడంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. పదవులను భర్తీ చేయడం తేనె తుట్టెను కదిలించినట్లేనని వారు భావిస్తూ వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మున్సి పల్ ఎన్నికల సమయంలో పలవురికి కోఆప్షన్ పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతం వారంతా తమకు అవకాశం కల్పించాలని నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. వీరిలో ఒకరికి ఇచ్చి మరొకరికి లేదంటే లేనిపోని సమస్యలు వస్తామని భావించి ఏకంగా మొత్తం ప్రక్రియనే వాయిదా వేసినట్లు సమాచారం. ఇలా ఎంతకాలం వాయిదా వేస్తారని.. ఏదో ఒకరోజు ఈ పదవులను భర్తీ చేయాల్సిందే కదా అని.. ఇప్పటికై నా మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక దృష్టిసారించి ఆశావహులను కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు అంటున్నారు.
మాజీ ప్రజాప్రతినిధుల కోటాలో కోదాడ మాజీ సర్పంచ్‌లు ఎర్నేని బాబు, పారా సీతయ్య ఇద్దరు తమకు కోఆప్షన్ అవకాశం కల్పించాలని గట్టిగా కోరుతున్నారు. ప్రస్తుతం ఎర్నేనిబాబు సతీమణి కుసుమ కుమారి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమెకు మున్సిపల్ సమావేశాల్లో సహాయ సహకారాలు అందించాలంటే తాను మున్సిపల్ సమావేశాల్లో పాల్గొవాలని అందుకు తనకు కో ఆప్షన్ పదవి ఇవ్వాలని బాబు కోరుతున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని చెరిసగం కాలమని చెప్పారని, రెండున్నర సంవత్సరాల తరువాత తన సతీమణి పారా సత్యవతికి చైర్‌పర్సన్ పదవి ఇస్తామని ఒప్పందం జరిగినందున తనకు కూడ కోఆప్షన్ అవకాశం ఇవ్వాలని పారా సీతయ్య గట్టిగానే కోరుతున్నారు. ఇక ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీలలో కూడా గట్టిపోటీనే ఉండడంతో ఈ పదవులు ఎవరిని వరిస్తాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పది సంవత్సరాలుగా పదవులు లేకుండా ఉన్నామని.. ఇప్పుడు అవకాశం వచ్చినందున వెంటనే పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు కోరుతున్నారు.
ఫ భర్తీకాని కోదాడ
మున్సిపల్ కోఆప్షన్ పదవులు
ఫ రాష్ట్రంలోనే అత్యధికంగా దరఖాస్తులు
ఫ రెండు నెలలు దాటినా దృష్టిపెట్టని
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి
ఫ ఎదురుచూపుల్లో ఆశావహులు


