నిప్పుల గుండమే! | - | Sakshi
Sakshi News home page

నిప్పుల గుండమే!

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎండల తీవ్రత పెరుగనుండటంతో వాతావారణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. జిల్లాలో ఇప్పటికే 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో 44 డిగ్రీలకంటే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆ రెండు రోజులు రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

ఇప్పటికే అల్లాడుతున్న జనం

గతంలో కంటే ఈసారి ఎండల తీవ్రత పెరిగింది. గాలిలో తేమ శాతం తగ్గింది. ఎండలతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లో కూడా వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. అయితే బుధ, గురువారాల్లో 44 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈనెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తే కూడా ప్రారంభం అవుతుండటంతో ఎండలు మండిపోయే పరిస్థితి ఉంటుందని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇళ్ల వద్దే ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లొద్దు

ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లక పోవడం మంచిది. దాహం వేయక పోయినా ప్రతి గంటకు నీరు, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తాగాలి. తేలికపాటి, వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిది. బయటకు వెళ్తే తప్పనిసరిగా గొడుగు, టోపీ, సన్‌ గ్లాసెస్‌ లేదా తలపై టవల్‌ వాడాలి. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడమే మంచిది. దోసకాయ, టమాటా, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలో లేదా ఫ్యాన్‌, ఏసీ ఉన్న చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడి గుడ్డతో ఒళ్లు తుడవాలి. పరిస్థితి విషమిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

– డాక్టర్‌ రాజీవ్‌, జనరల్‌ ఫిజీషియన్‌,

జిల్లా కేంద్ర వైద్యశాల ఆస్పత్రి

ఫ 21,22 తేదీల్లో 44 డిగ్రీలు దాటనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు

ఫ సూర్యాపేట జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

ఫ నల్లగొండ జిల్లాకు రెడ్‌, యాదాద్రికి ఆరెంజ్‌ హెచ్చరిక

ఫ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన

Advertisement
 
Advertisement
Advertisement