భానుపురి (సూర్యాపేట) : చేయూత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల వారికి పింఛన్లను అందిస్తోంది. కొందరికి పోస్టాఫీసుల్లో ఇస్తుండగా, మరి కొందరికి నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ పథకంలో కొన్ని అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారులు చనిపోతే పింఛన్ డబ్బులు వారి వాతాల్లో జమ అవుతుండగా కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు. దీనిని అరికట్టి మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం లబ్ధిదారుల సజీవ నిర్ధారణ (లైవ్‌నెస్ అథెంటికేషన్) సర్వే చేయాలని నిర్ణయించింది.
బ్యాంకు ఖాతాలతోనే..
గ్రామీణ ప్రాంతాల్లో గతేడాది జూలై నుంచి ఫేస్ రికగ్నసైడ్ యాప్ ద్వారా పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. దాంతో మరణించిన వారికి ఈ పింఛన్ అందే అవకాశం లేదు. అయితే డయాలసిస్, పైలేరియాతో పాటు కొందరు పింఛన్ దారుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం ఫించన్ మొత్తాన్ని జమ చేస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల మంది వరకు పింఛన్ పొందుతున్నారు. ఈ విధానంలో అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో ఆయా పింఛన్ దారులను పరిశీలించనున్నారు.
తేలనున్న లబ్ధిదారులు
ప్రస్తుతం జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 53,205 మందికి, దివ్యాంగ పింఛన్లు 18,458 మందికి, వితంతు 56,277, ఒంటరి మహిళ 6795, చేనేత 873, కల్లుగీత కార్మికులు 6,552, ఎయిడ్స్ బాధితులు 1,205, పైలేరియా 2,109, డయాలసిస్ 258 మందికి అందుతున్నాయి. ఈ సర్వేతో బతికి ఉన్న లబ్ధిదారులు ఎంతమంది, ఎంతమంది మరణించారనే వివరాలు తెలియనున్నాయి.
వివరాల సేకరణ
ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా.. బ్యాంకుల ద్వారా పింఛను తీసుకునే లబ్ధిదారుల ఇళ్లకు పట్టణాల్లో వార్డు అధికారులు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వెళ్తారు. వారి ఫోన్లలోని ముఖ గుర్తింపు యాప్ ద్వారా లబ్ధిదారుల ముఖాన్ని, కళ్లను స్కాన్ చేస్తారు. దాంతో ఆధార్ డేటా బేస్‌లోని వివరాలతో మ్యాచ్ అవుతుంది. మరణించిన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడిన లబ్ధిదారుల విషయాన్ని స్థానికంగా విచారించి నిర్ధారిస్తారు. అందు బాటులో లేని వారికి మూడు నెలల గడువు ఇస్తారు. ఆ గడువులోగా వారు ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. లేకపోతే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు.
చేయూత పింఛన్లలో అక్రమాల
గుర్తింపునకు సర్వే
పోస్టాఫీసులు, అకౌంట్లలో
జమయ్యే పింఛన్ల పరిశీలన
లైవ్‌నెస్ అథెంటికేషన్
సర్వేతో ముందుకు


