లక్ష్మీనరసింహుడికి నిత్య పూజలు | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనరసింహుడికి నిత్య పూజలు

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యదారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేపట్టారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వర స్వామి కి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

పీఆర్సీ కమిటీ

రిపోర్ట్‌ ప్రకటించాలి

సూర్యాపేటటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నూతన పీఆర్‌సీ కమిటీ రిపోర్టును వెంటనే ప్రకటించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆఫీస్‌ బేరర్‌ సమావేశంలో మాట్లాడారు. నూతన పీఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌. అనిల్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు కె. అరుణభారతి, కోశాధికారి జి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శిలు ఎన్‌. నాగేశ్వరరావు, వెలుగు రమేష్‌, చిలక రమేష్‌, కె.బాల సైదిరెడ్డి, డి.శ్రీనివాసచారి పాల్గొన్నారు.

టీజీఆర్‌జేసీలో

చిలుకూరు విద్యార్థి ప్రతిభ

చిలుకూరు : ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన టీజీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలో చిలుకూరు గ్రామానికి చెందిన కొడా రు కౌషిక్‌ సాయి రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంక్‌ సాధించాడు. కౌషిక్‌ సాయి పదవ తరగతిలో 564 మార్కులతో మండల టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కౌషిక్‌ సాయి మాట్లాడుతూ జేఈఈ మెయిన్‌లో ర్యాంక్‌ సాధించడమే తన లక్ష్యమన్నారు. కౌషిక్‌ సాయిని పలువురు అభినందించారు.

కేవీలో అడ్మిషన్లు

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ జి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 8 సీట్లు, 8వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement