సూర్యాపేటటౌన్ : డ్రగ్స్ తో యువత జీవితం మసి అవుతుందని దానిని మానేస్తే జీవితం ఖుషీ అవుతుందని, డ్రగ్స్ మన సమాజాన్ని, మన పిల్లలను పట్టి పీడిస్తోందని ఎస్పీ నరసింహ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలల భద్రత, మహిళా భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, స్థానిక పౌరులతో కలిసి సూర్యాపేట పట్టణ పోలీసులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ నర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనేది అత్యంత ప్రమాదకర స్థాయిలో పాతుకుపోయిందని, దీనిని కూకటివేళ్లతో తీసివేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందన్నారు. మహిళల భద్రత, బాలల భద్రతకు పోలీస్ శాఖ పటిష్టంగా కృషి చేస్తోందన్నారు. దీనికోసం షీ టీం సిబ్బంది, భరోసా టీం సిబ్బంది, మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలు, శాంతిభద్రతల పోలీసులతో కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలపై , బాలలపై వేధింపులు జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు, 112 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదులు చేస్తే పోలీసులు మీ ఇంటి వద్దకు, మీరు ఉంటున్న ప్రదేశానికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించి అక్కడే కేసులు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌కాపీ అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, మానవ అక్రమ రవాణా నిరోధక టీం ఇన్‌స్పెక్టర్ శివకుమార్, పట్టణ ఎస్‌ఐలు ఐలయ్య, సాయిరాం, ఏడుకొండలు, వెంకన్న, షీ టీం ఎస్‌ఐ నీలిమ, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఆకర్షణకులోను కావొద్దు
ఫ ఎస్పీ నరసింహ సూచన


