భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ప్రతి నివాస ప్రాంతంలో ప్రజల అవసరాలకు సరిపడా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులకు సూచించారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడ కూడా దాహార్తి సమస్య తలెత్తకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓలు ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సిన మరమ్మతులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు మూడు నెలలు ఎంతో కీలకమైనందున నీటి సరఫరా విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. మరమ్మతులు చేపట్టే విషయాన్ని ప్రజలకు సైతం ముందుగానే తెలియజేస్తే వారు తగిన విధంగా సన్నద్ధం అవుతారని సూచించారు. బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును పక్కాగా పర్యవేక్షణ జరపాలని, తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శిరీష, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసరావు, డీపీఓ యాదగిరి, అడిషనల్ డీఆర్డీఓ ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎఈఈ, ఎంపిఓ, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


